పాక్‌ పద్దతిలో బిజెపి ఎన్నికల ప్రచారం!

April 25, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో ఈసారి బిజెపి నేతల ప్రచారం చాలా చిత్రవిచిత్రంగా సాగుతోందని చెప్పవచ్చు. మొదట తమ హయాంలో జరిగిన దేశాభివృద్ధి గురించి గట్టిగా చెప్పుకొన్న బిజెపి నేతలు ఆ తరువాత అభివృద్ధి మంత్రాన్ని పక్కన పెట్టి సంక్షేమమంత్రాలు పటించడం మొదలుపెట్టారు. ఆ తరువాత బిజెపి బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న పుల్వామా ఉగ్రదాడులు, సర్జికల్ స్ట్రైక్స్, వాయుసేన దాడుల గురించి నొక్కి చెప్పడం మొదలుపెట్టారు. తాజాగా కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తే దేశంలో అస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని వాదిస్తున్నారు. 

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోంటూ ముందుకు సాగడం సహజమే కనుక ఈవిషయంలో బిజెపిని కూడా తప్పుపట్టలేము. కానీ తమ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకొని ఓట్లు కోరే బదులు బిజెపి కూడా ప్రజలలో సెంటిమెంటు రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకోవాలనుకోవడమే ఆశ్చర్యకరం.           

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వైఫల్యం చెందడం, ప్రధాని నరేంద్రమోడీ ధీటుగా స్పందిస్తున్న మాట నిజం. అలాగే నరేంద్రమోడీ అధికారం చేపట్టిన తరువాత సరిహద్దుల వద్ద పాక్‌ దాడులను తిప్పి కొట్టేందుకు భారత్‌ సైనికులకు స్వేచ్చ లభించిన మాట వాస్తవం. దేశంలో ఉగ్రదాడులు ఆగిన మాట వాస్తవం. కానీ లోక్‌సభ ఎన్నికలు కీలకు దశకు చేరుకోగానే బిజెపి నేతలందరూ ఉగ్రవాదం, దేశభద్రత, వాయుసేన దాడుల గురించి గట్టిగా నొక్కి చెప్పుకొంటూ ప్రజలలో సెంటిమెంటు రాజేసి ఓట్లు సంపాదించుకోవాలని తాపత్రయపడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

ఇంతకాలం పాకిస్థాన్‌ పాలకులు భారత్‌ను బూచిగా చూపిస్తూ పాక్‌ ప్రజలను ఆకట్టుకొని అధికారం చేజిక్కించుకొనేవారు. ఇప్పుడు బిజెపి నేతలు కూడా పాకిస్థాన్‌...ఉగ్రవాదులను బూచిగా చూపిస్తూ లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. బిజెపి వ్యూహం ఫలిస్తుందో లేదో తెలియదు కానీ దేశరక్షణకు సంబందించిన అంశాన్ని ఎన్నికలతో ముడిపెట్టాలనుకోవడం చాలా అనర్ధదాయకమని చెప్పక తప్పదు. 


Related Post