రాష్ట్ర ప్రభుత్వాలను నిందిస్తే బిజెపికి ఓట్లు పడతాయా?

April 24, 2019


img

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారసభలలో పాల్గొంటున్న ప్రధాని నరేంద్రమోడీ కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆయుష్మాన్ భారత్ వంటి సంక్షేమ పధకాలను అమలుచేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాయని, కొన్ని కేంద్రప్రభుత్వం పధకాలకు పేర్లు మార్చి తమ సొంత పధకాలుగా ప్రచారం చేసుకొంటున్నాయని ఆరోపిస్తున్నారు. కేంద్ర పధకాలను సొంత పధకాలుగా చెప్పుకొంటున్న ముఖ్యమంత్రులను ‘స్టిక్కర్ సిఎం’లని ఎద్దేవా చేస్తున్నారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలను, వాటి ముఖ్యమంత్రులను ఉద్దేశ్యించి ప్రధాని నరేంద్రమోడీ ఇటువంటి ఆరోపణలు చేశారు. మోడీ ఆరోపణలు చేస్తున్న రాష్ట్రాలలో బిజెపియేతర ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. 

కేంద్రప్రభుత్వం ప్రకటించిన పధకాలలో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతాయనుకొనేవాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రైతుబంధు పధకాన్ని అమలుచేస్తున్నప్పటికీ, కేంద్రం ప్రవేశపెట్టిన ‘కిసాన్ సమ్మాన్’ పధకాన్ని కూడా యదాతధంగా అమలుచేస్తోంది. దాని వలన కూడా రైతులకు లబ్ధి కలగాలనే ఉద్దేశ్యంతోనే అమలుచేస్తోంది. అయితే కేంద్ర పధకాలకంటే మేలైన పధకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్నప్పుడు మాత్రం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రపధకాలను పక్కన పెడుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ కూడా వాటిలో ఒకటి. తెలంగాణతో సహా వివిద రాష్ట్రాలలో దానికంటే మెరుగైన పధకాలు అమలులో ఉన్నాయి. 

ఇక కొన్ని కేంద్రప్రభుత్వ పధకాల పేర్లను మార్చి రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత పధకాలుగా ప్రచారం చేసుకొంటున్న మాట వాస్తవం. అధికారంలో ఉన్నపార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆవిధంగా వ్యవహరించడం మామూలే. అటువంటప్పుడు ఆయా రాష్ట్రాలలో బిజెపి నేతలు రాష్ట్రంలో అమలవుతున్న కేంద్రపధకాల గురించి గట్టిగా ప్రచారం చేసుకోవలసి ఉంటుంది. కానీ వారు నిర్లిప్తంగా వ్యవహరిస్తూ తమ పార్టీకే నష్టం కలిగించుకొంటున్నారు. కనుక కేంద్రపధకాల అమలు, కాపీ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను నిందించడం కంటే రాష్ట్ర బిజెపి నేతలనే నిందించవలసి ఉంటుంది. 

ఇక ముఖ్యమంత్రులను ‘స్టిక్కర్ సిఎం’ అని ఎద్దేవా చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ సిఎం కేసీఆర్‌ రూపకల్పన చేసిన రైతుబంధు పధకం స్పూర్తితోనే కిసాన్ సమ్మాన్ పధకాన్ని ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అంటే కేంద్రప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం పధకాలను కాపీ కొడుతోంది కదా?అయినా సంక్షేమ పధకాల లక్ష్యం, ఉద్దేశ్యం ప్రజలకు మేలు కలిగించాలనే కానీ వాటి పేరు చెప్పుకొని రాజకీయలబ్ది పొందడానికి కాదు కదా?      

జిఎస్టీ వంటి నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వాలచేత బలవంతంగా అమలుచేయించగలుగుతున్నప్పుడు కేంద్రపధకాలను ఎందుకు అమలుచేయించలేకపోతోంది? వాటిని అమలుచేయించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే కదా? అయినా రాష్ట్ర ప్రభుత్వాలను నిందించినంత మాత్రన్న బీజేపీకి ఓట్లు రాలుతాయా? 


Related Post