కాళేశ్వరంలో మరో కీలకఘట్టం విజయవంతం

April 24, 2019


img

కాళేశ్వరం ప్రాజెక్టులో బుదవారం మరో కీలకఘట్టం విజయవంతంగా సాగుతోంది. నందిమేడారం సర్జిపూల్ వద్ద బిగించిన నాలుగు పంపు మోటర్లలో ఒకదానిని ఆన్‌ చేయగానే సర్జిపూల్లో నిలవున్న నీరు నందిమేడారం రిజర్వాయరులోకి గలగల ప్రవహించడం మొదలైంది. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ బుదవారం మధ్యాహ్నం 11 గంటలకు నందిమేడారం సర్జిపూల్ పంప్‌హౌస్‌లో పూజలు నిర్వహించి మోటారును ఆన్‌ చేయగానే గోదావరి జలప్రవాహం మొదలైంది. 



నందిమేడారం సర్జిపూల్ పంప్‌హౌస్‌లో 124.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు మోటర్లను అమరుస్తున్నారు. వాటిలో 4 మోటర్లు నీటిని ఎత్తిపోయడానికి సిద్దంగా ఉన్నాయి. వాటిలో మొదటి పంపును స్మిత సభర్వాల్ నేడు ప్రారంభించారు. మొదటిసారిగా ప్రారంభించిన ‘వెట్ రన్’ విజయవంతం అయినందున రేపటి నుంచి రోజుకో మోటారు చొప్పున ఆన్‌ చేస్తూ మేడారం రిజర్వాయరును నీటితో నింపుతామని కాళేశ్వరం అధికారులు చెప్పారు. 

మేడారం రిజర్వాయరు నిండిన తరువాత మళ్ళీ అక్కడి నుంచి నీటిని విడుదల చేస్తే అవి కాలువల ద్వారా లక్ష్మీపూర్‌ సర్జ్‌పూల్‌కు చేరుకొంటాయి. మళ్ళీ అక్కడ ఎత్తిపోస్తే గోదావరి జలాలు మిడ్ మానేరు చేరుకొంటాయి. కనుక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో పలు జిల్లాలలో నీటి కరువు తీరిపోవడమే కాక, ఏడాదికి మూడు పంటలు వేసుకొనే అవకాశం ఉంది.

 



Related Post