పదవుల కోసం పార్టీ మారుతూ మళ్ళీ కన్నీళ్ళు ఎందుకో?

April 24, 2019


img

తెరాసలో చేరబోతున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆయన భార్య జ్యోతి మంగళవారం భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైనప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నందుకు కంటతడి పెట్టారు. మూడు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిద హోదాలలో పనిచేసిన తాము తప్పనిసరి పరిస్థితులలోనే పార్టీని వీడవలసి వస్తోందని అందుకు చాలా బాధపడుతున్నామని గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. జిల్లాను, నియోజకవర్గాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలని తామిరువురం ఎపుడూ బాధపడుతుండేవారమని, తెరాస సర్కార్ ద్వారానే అది సాధ్యమవుతుందని గ్రహించి నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకొనేందుకే తెరాసలో చేరుతున్నామని చెప్పారు. 

గండ్ర దంపతులకు నిజంగా తమ జిల్లాను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తాపత్రయమే ఉండి ఉంటే, పదేళ్ళు సమైక్యరాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే చేసి ఉండాలి. కానీ అప్పుడు పట్టించుకోలేదు. నిజానికి వారొక్కరే కాదు కాంగ్రెస్‌ నేతలలో చాలామంది పదవులు,అధికారం కోసమే రాజకీయాలు చేశారు తప్ప తమ నియోజకవర్గాల అభివృద్ధి చేసుకొందామని ఆలోచించలేదు. అందుకే తెలంగాణ అంతగా వెనుకబడిపోయింది. 

తెలంగాణ ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన తరువాతే రాష్ట్రంలో భూపాలపల్లితో సహా అన్ని జిల్లాలలో అభివృద్ధి కనిపిస్తోంది. కనుక గండ్ర దంపతులు తెరాసలో చేరినా చేరకపోయినా భూపాలపల్లి జిల్లా, నియోజకవర్గం అభివృద్ధి నిలిచిపోదని అర్ధం అవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంధకారంగా మారుతోంది కనుకనే వారిరువురు తమ రాజకీయ మనుగడ కోసం తెరాసలో చేరుతున్నారనే విషయం అందరికీ తెలుసు. వారు పార్టీలో చేరగానే గం వరంగల్ గ్రామీణ జిల్లా జెడ్.పి.టీ.సీ. ఛైర్మన్ అభ్యర్ధిగా ఖరారు చేస్తునట్లు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రకటించారు. గండ్ర వెంకటరమణా రెడ్డికి కూడా త్వరలోనే ఏదో ఓ పదవి ఇవ్వవచ్చు. కనుక నేటికీ వారు పదవులు, అధికారం కోసమే పార్టీ మారుతున్నారని చెప్పక తప్పదు. పదవుల కోసం పార్టీ మారుతూ ‘కాంగ్రెస్ పార్టీని బాధాతప్త హృదయాలతో వీడుతున్నామని’ గండ్ర దంపతులు చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.ఒకవేళ వారికి కాంగ్రెస్ పార్టీ పట్ల అంతా మమకారమే ఉంటే, పార్టీని వీడేటప్పుడు ఆ పార్టీ ద్వారా లభించిన ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి కృతజ్ఞతలు చాటుకోవచ్చు కదా? కానీ అందుకూ ఇష్టపడరు. అంటే అర్ధం ఏమిటి?  


Related Post