ఇంటర్ విద్యార్దుల సమస్యపై జగదీష్ రెడ్డి స్పందన

April 24, 2019


img

ఇంటర్మీడియెట్ విద్యార్దుల సమస్యపై రాష్ట్రంలో నానాటికీ ఆందోళనలు పెరుగుతుండటంపై రాష్ట్ర విద్యాశాఖామంత్రి  జగదీష్ రెడ్డి స్పందించారు. మంగళవారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ, “ఇంటర్ ఫలితాలలో జరిగిన పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలు దీనిని రాజకీయం చేస్తున్నాయి. ఇంటర్ ఫలితాలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది. దాని నివేదిక చేతికి రాగానే ఎవరు తప్పు చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకొంటాము. ఏ ఒక్క విద్యార్ది నష్టపోకుండా చూస్తాము. కనుక విద్యార్దులు, తల్లితండ్రులు ఆందోళన చెందవద్దని కోరుతున్నాను.  విద్యార్దులు తక్షణమే రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరుతున్నాను,” అని అన్నారు. 

 రాష్ట్రంలో ఏదైనా ఒక సమస్య ఏర్పడినప్పుడు దానిని ప్రభుత్వమే తక్షణం పరిష్కరించవలసి ఉంటుంది. కానీ ఆ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం ఆలస్యం చేసినా లేదా అలసత్వం ప్రదర్శించినా అప్పుడు ఆ సమస్యను ఎదుర్కొంటున్న ప్రజలు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ఈవిధంగానే రోడ్లపైకి రాకమానరు. నిజామాబాద్‌ పసుపు, ఎర్రజొన్న రైతులు, ఇప్పుడు ఇంటర్ విద్యార్దులు, వారి తల్లితండ్రులు అదే చేస్తున్నారు. వారికి రాజకీయం అంటగట్టాలనుకోవడం సరికాదు.

ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే అప్పుడు ప్రతిపక్షాలు వారికి సంఘీభావం తెలుపడం సర్వసాధారణమైన విషయం. అది ప్రతిపక్షాల బాధ్యత కూడా. కనుకనే అవి వారి సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. దానిని రాజకీయం చేయడం అనడం సరికాదు. తమ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్న ప్రతిపక్షాలను నిందించడం హాస్యాస్పదంగా ఉంది.

ఇంటర్ బోర్డు ముందు ఆందోళనలు చేస్తున్నవారిలో అధికశాతం రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్య ప్రజలే. వారు తమ రోజువారీ పనులు మానుకొని ఎందుకు ఆందోళన చేస్తున్నారు? వారిలో అంత ఆగ్రహం, ఆవేదన ఎందుకు కలిగింది? అని ఆలోచించాలి తప్ప ప్రతిపక్షాలను నిందిస్తే ఈ సమస్య పరిష్కారమైపోదు. ప్రభుత్వం సకాలంలో సమస్యను గుర్తించి పరిష్కరించి ఉండి ఉంటే దీనిపై ప్రతిపక్షాలకు రాజకీయం చేసే అవకాశం ఉండేది కాదు కదా?


Related Post