నిజామాబాద్‌ రైతులు సంచలన నిర్ణయం

April 23, 2019


img

ఇటీవల రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నామినేషన్లు వేసి అందరి దృష్టిని ఆకర్షించిన  నిజామాబాద్‌ నుంచి 176 మంది రైతులు ఈసారి అంతకంటే సంచలన నిర్ణయమే తీసుకొన్నారు. ఈసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి(కాశీ)లో స్వతంత్ర అభ్యర్దులుగా నామినేషన్లు వేసి ప్రధాని నరేంద్రమోడీపై పోటీ చేయాలని నిర్ణయించుకొన్నారు. నిజామాబాద్‌లోని ఆర్మూర్, నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గాల నుంచి 50 మంది పసుపు రైతులు దీని కోసం ‘చలో వారణాసి’ అంటూ కాశీకి బయలుదేరారు. తమ సమస్యలను ప్రధాని నరేంద్రమోడీకి, జాతీయస్థాయిలో మీడియాకు, దేశంలో రైతుసోదరులందరి దృష్టికి తీసుకువెళ్ళేందుకే వారణాసి నుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్లు పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగామణి తెలిపారు. పసుపు పంటకు మద్దతు ధర సాధించడమే తమ లక్ష్యమని, కనుక దేశంలో ఇతర రాష్ట్రాలలో పసుపు పంట పండిస్తున్న రైతులు తమతో కలిసిరావాలని ఆయన చేశారు. తమిళనాడు నుంచి కూడా కొందరు రైతులు వారణాసి వచ్చి నామినేషన్లు వేయనున్నారని దైవశిగామణి తెలిపారు.

జిల్లాలో రైతులు ఇంత ఐఖ్యత, పోరాట స్పూర్తి కనబరచడం అభినందనీయమే కానీ వారి పోరాటాలు అగమ్యంగా సాగుతునట్లు చెప్పవచ్చు. ఎందుకంటే, రైతులు తమ సమస్యను గట్టిగా నొక్కి చెప్పాలనుకొంటే అందరూ కలిసి తమ ప్రతినిధిగా ఒక అభ్యర్ధిని నిలబెట్టి అతను లేదా ఆమెను గెలిపించుకొనేందుకు గట్టిగా ప్రయత్నించి ఉంటే వారి సంఘటిత శక్తి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసి ఉండేది. అప్పుడు వాటిలో కదలిక వచ్చేది. కానీ ఈవిధంగా అనేకమంది నామినేషన్లు వేయడం వలన వారి సమస్యపై మీడియాలో చర్చ జరిగినప్పటికీ ఎన్నికలు పూర్తయ్యేక అందరూ వారిని మరిచిపోవడం ఖాయం. 

తమిళనాడు రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సుమారు 6 నెలల పాటు డిల్లీలో బైటాయించి రకరకాలుగా దీక్షలు చేసినప్పుడే పట్టించుకోని కేంద్రప్రభుత్వం ఇప్పుడు జిల్లా నుంచి కొందరు రైతులు వారణాసికి వచ్చి నామినేషన్లు వేస్తే మారిపోతుందనుకోవడం అవివేకం, అత్యాశే. కనుక ఒక గమ్యం లేకుండా చేసే ఇటువంటి పోరాటాల వలన రైతులకు ఒరిగేదేమీ ఉండదు జేబులో మిగిలిన కొద్దిపాటి డబ్బు కూడా ఖర్చు చేసుకోవడం తప్ప. వారు నిజంగా తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి పోరాడదలచుకొంటే మేధావులను లేదా రైతు శ్రేయోభిలాషుల సలహాలు తీసుకొని ముందుకు సాగితే మంచిది. లేకుంటే వారి కష్టం ఏట్లో పిసికిన చింతపండే అవుతుంది.


Related Post