ప్రాంతీయ పార్టీలో జాతీయపార్టీ విలీనమా అవ్వ!భట్టి విక్రమార్క

April 23, 2019


img

తెరాసలో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని కోరుతూ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్ అలీ, ఈరావత్రి అనీల్  మంగళవారం ఉదయం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్ళి వినతిపత్రం ఇచ్చారు. 

అనంతరం స్పీకర్ నివాసం వద్దే మల్లు భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని తెరాసలో విలీనం చేస్తామని మా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే చెప్పడం చాలా బాధాకరం. దానిని మేము ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయపార్టీ. దానిని ఒక ప్రాంతీయ పార్టీలో ఏవిధంగా విలీనం చేస్తారు?ఒక పార్టీని మరో పార్టీలో విలీనం చేయాలంతే దానికి చాలా తతంగం ఉంటుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనుకొన్నప్పుడు ఆ పార్టీలో గ్రామస్థాయి నుంచి పార్టీ అధినేత వరకు అందరూ తీర్మానాలు చేసి ఆమోదించిన తరువాతే విలీనం జరిగింది. కానీ ఇప్పుడు సిఎం కేసీఆర్‌ మా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపజేసి వారి చేత విలీనం ప్రతిపాదన చేయిస్తున్నారు. ఇది చాలా దారుణమైన ఆలోచన. కేసీఆర్‌ ప్రభుత్వం నిసిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరిపై అనర్హత వేటువేసి కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తున్న ఈ తప్పును సరిదిద్ది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మేము స్పీకరును కోరాము,” అని చెప్పారు. 

ఫిరాయింపులపై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు రాజ్యాంగం ప్రకారం ఏవిధంగా ముందుకు సాగాలో ఆవిధంగానే సాగుతున్నారనే దానిలో ఏమాత్రం సందేహం లేదు. కానీ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవలసిన వ్యక్తులు, వ్యవస్థలే దానిని అతిక్రమిస్తున్నప్పుడు ఇటువంటి ప్రయత్నాల వలన ఏమీ ప్రయోజనం ఉండదని వారికీ తెలుసు. తెరాస సర్కార్ తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీస్తున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ కూడా దానిని రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప న్యాయం, ధర్మం అంటూ వల్లెవేస్తే సమస్య పరిష్కారం కాదని కాంగ్రెస్‌ నేతలకు తెలియదనుకోలేము. 

 ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌ కేసీఆర్‌ను, తెరాసను ఏమాత్రం ఎదుర్కొలేని స్థితిలో ఉంది. ఎందుకంటే, దానికి ప్రజల ఆదరణ కరువైంది. ఉంగరం పడిన చోటునే వెతుకొంటేనే ఏమైనా ఫలితం ఉంటుంది కానీ వేరే చోట ఎంత వెతికినా ప్రయోజనం ఉండబోదు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే. కనుక తెరాసను ఎదుర్కోగల బలమైన నాయకుడిని గుర్తించి ఎన్నుకొని, పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవడానికి గల మార్గాలను, అవకాశాలను కనుగొని, ప్రజలకు చేరువయ్యేందుకు గట్టిగా కృషి చేస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించగలదు. 

కళ్లెదుట సమస్య... దానికి గల కారణాలు ఇంత స్పష్టంగా కనబడుతున్నప్పటికీ, కాంగ్రెస్‌ నేతలు ఇంకా మూస పద్దతిలో ముందుకు సాగదలిస్తే చివరికి పార్టీలో ఎవరూ మిగలరు...పార్టీ కూడా మిగలదు.


Related Post