తదుపరి ప్రధాని యూపీ నుంచే: అఖిలేశ్

April 23, 2019


img

యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ‘తదుపరి ప్రధాని ఎవరనే’ ఓ విలేఖరి ప్రశ్నకు సమాధానంగా, “ఈసారి నరేంద్రమోడీ ప్రధాని కాబోరని ఖచ్చితంగా చెప్పగలను. కాంగ్రెస్ పార్టీకి కూడా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేయలేకపోవచ్చు కనుక రాహుల్ గాంధీ కూడా ప్రధాని అయ్యే అవకాశం లేదనే చెప్పవచ్చు. కాంగ్రెస్, బిజెపిల కంటే ఈసారి ప్రాంతీయ పార్టీలే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్నాయి కనుక ప్రధాని ఎవరనేది నిర్ణయించబోయేది అవే. నేను ప్రధాని రేసులో లేను కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తే ప్రధాని కావాలని నేను కోరుకొంటున్నాను. లోక్‌సభ ఎన్నికల తరువాత భావస్వారూప్యత కలిగిన ప్రాంతీయ పార్టీలన్నీ సమావేశమయ్యి ప్రధాని అభ్యర్ధిని నిర్ణయించుకొంటాము,” అని చెప్పారు.

తెలంగాణ సిఎం కేసీఆర్‌ చెపుతున్న మాటలనే అఖిలేశ్ యాదవ్ కూడా చెపుతున్నారని అర్ధం అవుతోంది. అయితే యూపీకి చెందిన వ్యక్తే ప్రధాని కావాలని కోరుకొంటున్నానని చెప్పడం ద్వారా తమ పార్టీ మాయావతి అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వాలనుకొంటోందని చెపుతున్నట్లే భావించవచ్చు. 

వారిరువురూ ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగస్వాములుగా ఉంటారని తెరాస చెపుతోంది. కనుక ఆ రెండు పార్టీల కంటే చాలా తక్కువ ఎంపీ సీట్లు కలిగి ఉండబోయే తెరాస వారికే మద్దతు ఈయవలసి రావచ్చు. ఈసారి ఎన్నికలలో 300కు పైగా ఎంపీ సీట్లు గెలుచుకొంటామని బిజెపి, ప్రాంతీయ పార్టీల మద్దతుతో కేంద్రంలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకొంటున్నాయి. కనుక ఆ రెండు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితిలో ఉంటేనే ఫెడరల్‌ ఫ్రంట్‌కు అవకాశం లభిస్తుంది. ఒకవేళ ఆ రెంటిలో ఏదీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ, ఆ అవకాశం ఉన్న పార్టీ తప్పకుండా ప్రాంతీయ పార్టీలకు కేంద్రమంత్రి పదవులు ఎరవేసి ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. కనుక ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరుతాయని భావిస్తున్న భాగస్వామ్యపార్టీలకు భారీగా ఎంపీ సీట్లు గెలుచుకొంటే తప్ప కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడం కష్టమే.


Related Post