సిఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదు? ఉత్తమ్

April 23, 2019


img

ఇంటర్ ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 16 మంది విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. నాంపల్లి వద్ద ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ప్రతీరోజు విద్యార్దులు, వారి తల్లితండ్రులు, విద్యార్ధి సంఘాలు, ప్రతిపక్ష నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ సిఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడంలేదని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 

త్వరలో తెరాసలో చేరబోతున్నారని భావిస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే  జగ్గారెడ్డి కూడా ఈ సమస్యపై స్పందిస్తూ కనీసం ఇప్పటికైనా సిఎం కేసీఆర్‌ కలుగజేసుకొని విద్యార్దులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. “ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలో జరిగిన అవకతవకలపై ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్ ఇచ్చిన సమాధానం సమస్యలను కప్పిపుచ్చి తప్పించుకొనిపోయేవిధంగా ఉంది. ఆయన చెప్పింది విన్నాక విద్యార్దులు, వారి తల్లితండ్రులలో ఆందోళన మరింత పెరిగింది. కనుక ముఖ్యమంత్రి కేసీఆర్‌ తక్షణం ఈ సమస్యను పరిష్కరించి విద్యార్ధులకు న్యాయం చేయాలి. విద్యార్దుల జీవితాలతో ఆటలాడుకొంటున్న అధికారులపై కటిన చర్యలు తీసుకోవాలి,” అని అన్నారు జగ్గారెడ్డి. 

నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించినప్పటికీ ఈరోజు ఉదయం కూడా విద్యార్దులు, వారి తల్లితండ్రులు, విద్యార్ధి సంఘాలు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనలు చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి గోషామహల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. 

రెవెన్యూశాఖలో అవినీతి పేరుకుపోయిందని చెపుతూ దానిని సమూలంగా ప్రక్షాళన లేదా రద్దు చేయడానికి సిద్దం అవుతున్న తెరాస సర్కార్, ఇంటర్ బోర్డులో ఇన్ని అవకతవకలు జరుగుతున్నప్పటికీ...విద్యార్దులు, వారి తల్లితండ్రులు రోజూ బోర్డు కార్యాలయం ముందు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఇంతవరకు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంటర్ బోర్డులో జరుగుతున్న అవకతవకలపై విచారణకు వేసిన త్రిసభ్య కమిటీ నివేదిక ఒకటి రెండురోజుల్లో సిఎం కేసీఆర్‌ చేతికి వస్తుంది. ఆ నివేదికలో ఏముంటుందో తెలియదు కానీ ఈ సమస్యను ప్రభుత్వం తక్షణం పరిష్కరించకపోతే వేలాదిమంది ఇంటర్ విద్యార్దులు భవిష్యత్ ప్రశ్నార్దకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఇంటర్ పరీక్షా ఫలితాలను, తదనంతర పరిణామాలను చూస్తున్న 10వ తరగతి విద్యార్దులు, వారి తల్లితండ్రులలో కూడా అప్పుడే ఆందోళన మొదలైంది.


Related Post