గోదావరి నీళ్ళతో నందిమేడారం కళకళ

April 23, 2019


img

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సోమవారం సాయంత్రం వరకు వరుసగా మూడోరోజూ కూడా గోదావరినీటిని విడుదల చేస్తుండటంతో ధర్మారం మండలంలోని నందిమేడారం వద్ద నిర్మించిన సర్జిపూల్‌ నీళ్ళతో కళకళలాడుతోంది. దానిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు తరలివస్తున్నారు. నీటితో కళకళలాడుతున్న సర్జిపూల్‌ను చూసి వారి మొహాలు కూడా సంతోషంతో కళకళలాడుతున్నాయి. 

కాళేశ్వరం ప్రాజెక్టులో 6వ ప్యాకేజీలో భాగంగా నందిమేడారం వద్ద నిర్మించిన సర్జిపూల్‌కు మొదట 100 క్యూసెక్కులు నీటిని విడుదల చేసిన తరువాత 10 మంది గజఈతగాళ్ళతో సర్జిపూల్‌ గోడలను పరీక్షింపజేశారు. వాటిలో ఎటువంటి పగుళ్లు లేవని నిర్దారించుకొన్న తరువాత పాలకుర్తి మండలం ఎల్లంపల్లి హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ఏర్పాటు చేసిన గేట్లలో రెండింటిని ఎత్తి సోమవారం ఉదయం మరో 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మళ్ళీ మరోసారి గజఈతగాళ్ళతో సర్జిపూల్‌ గోడలను పరీక్షింపజేశారు. అంతా సవ్యంగా ఉందని వారు స్పష్టం చేయడంతో సర్జిపూల్‌కు నిరవధికంగా నీటిని పంపిస్తున్నారు. సోమవారం రాత్రికి సర్జిపూల్‌లో నీటిమట్టం 133 అడుగులకు చేరుకొంది. 

రేపు అంటే బుదవారం ప్రయోగాత్మకంగా ‘వెట్ రన్’ నిర్వహించేందుకు అధికారులు సన్నాహం చేస్తున్నారు. ప్రస్తుతం నందిమేడారం పంపుహౌసులో నాలుగు భారీ మోటారుపంపులు నీటిని తోడేందుకు సిద్దంగా ఉన్నాయి. మొదట రెండు పంపులను నడిపించి అంతా సవ్యంగా ఉందని నిర్దారించుకొన్న తరువాత మిగిలిన రెండు పంపుమోటర్లను కూడా ఆన్‌ చేసి మేడారం రిజర్వాయరులో నీటిని నింపడం మొదలుపెడతారు. 

అంతా సవ్యంగా ఉన్నప్పటికీ ఇవాళ్ళ ఉదయం కూడా మళ్ళీ గజఈతగాళ్లను సర్జిపూల్‌ అడుగుభాగానికి పంపించి పరీక్షింపజేస్తున్నారు. 

ఈ వెట్ రన్ విజయవంతంమైతే రిజర్వాయరు నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తారు. అవి లక్ష్మీపూర్ వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌ వద్దకు చేరుకొన్నాక అక్కడ ఏర్పాటు చేసిన పంపుమోటర్లతో మళ్ళీ నీటిని ఎత్తిపోస్తే అవి వరదకాలువల ద్వారా మిడ్ మానేరుకు చేరుకొంటాయి. మరొక రెండు వారాలలో ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


Related Post