తెరాస సర్కార్ సెల్ఫ్ గోల్?

April 19, 2019


img

సిఎం కేసీఆర్‌ త్వరలో రెవెన్యూశాఖను పూర్తిగా రద్దు చేయడమో లేక సమూలంగా ప్రక్షాళన చేయడమో చేయాలని నిశ్చయించుకొన్నారు కనుక తెరాస నేతలు కూడా మీడియా చర్చలలో పాల్గొంటూ అందుకు అనుకూలంగా వాదనలు వినిపించడం మొదలుపెట్టారు. తెరాస అనుకూల పత్రికలు కూడా రెవెన్యూశాఖను రద్దు లేదా ప్రక్షాళన చేయడం ఎంత అవసరమో నొక్కి చెప్పేందుకు ఆ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, లంచగొండితనం గురించి తెలియజేసే అనేక వ్యవహారాలను రుజువులతో సహా స్వయంగా బయటపెడుతోంది. 

అయితే గత 5 ఏళ్లుగా తమ ప్రభుత్వం అత్యద్భుతంగా, అత్యంత నీతివంతంగా, అత్యంత పారదర్శకంగా పనిచేస్తోందని ‘సెల్ఫ్ సర్టిఫై’ చేసుకొన్న తెరాస నేతలే ఇప్పుడు రెవెన్యూశాఖలో అవినీతి, లంచగొండితనం పేరుకుపోయిందని దానికి తాము కూడా బాధితులమేనని చెప్పుకొంటున్నారు.

రెవెన్యూశాఖలో అవినీతి, లంచగొండితనం, ప్రక్షాళన అనే అంశంపై  శుక్రవారం ఉదయం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్లో జరిగిన చర్చలో పాల్గొన్న ఒక తెరాస నేత మాట్లాడుతూ, “నా పూర్వీకుల నుంచి నాకు వారసత్వంగా సంక్రమించిన భూమిని నాదేనని పాసుపుస్తకంలో వ్రాయించుకొనేందుకు గత నాలుగేళ్ళుగా రెవెన్యూశాఖ చుట్టూ తిరుగుతున్నాను. అధికార పార్టీలో ఉన్న మాకే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో తేలికగానే ఊహించుకోవచ్చు,” అని అన్నారు.

అంటే ఇంతకాలం తెరాస నేతలు ప్రభుత్వశాఖలలో ముఖ్యంగా రెవెన్యూశాఖలో జరుగుతున్న అవినీతి కనబడనట్లు నటించారని ఇప్పుడు అర్ధం అవుతోంది. కానీ ఇప్పుడు సిఎం కేసీఆర్‌ రెవెన్యూశాఖ రద్దు లేదా ప్రక్షాళనకు సిద్దంకాగానే రెవెన్యూశాఖపై అవినీతి ముద్రవేయడానికి వారు వెనకాడటం లేదు. రోజూ తెలుగు న్యూస్ ఛానల్స్ చూస్తున్న ప్రజలు రెవెన్యూశాఖ పట్ల తెరాసలో వచ్చిన ఈ మార్పును గమనించే ఉంటారు.

కొన్ని నెలల క్రితం రాష్ట్రంలో సమగ్రభూసర్వే నిర్వహించినప్పుడు ఇదే రెవెన్యూ ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడి  పనిచేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రభుత్వానికి గొప్ప పేరు తెచ్చారని సిఎం కేసీఆర్‌ మెచ్చుకొని వారికి బోనస్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు అందరూ అవినీతిపరులు కాదంటూనే రెవెన్యూశాఖపై అవినీతిముద్ర వేస్తున్నారు. 

త్వరలో జరుగబోయే పరిషత్ ఎన్నికలలో గ్రామాలలో భూసమస్యలు ప్రధాన అంశంగా నిలుస్తాయి కనుక గ్రామస్తుల ఆగ్రహం నుంచి తప్పించుకొనేందుకే సిఎం కేసీఆర్‌ హటాత్తుగా రెవెన్యూశాఖను ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నారని బిజెపి నేత సుబాష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఇది నిజమో కాదో తెలియదు కానీ తమపై అవినీతిముద్ర వేస్తున్నందుకు రెవెన్యూశాఖ ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒక్క రెవెన్యూశాఖలోనే కాదు దాదాపు అన్ని ప్రభుత్వశాఖలలో కూడా అవినీతి, లంచగొండితనం ఉందనే సంగతి ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వశాఖలలో అవినీతిని ప్రక్షాళన చేయాలనుకొంటే దానికి అవసరమైన యంత్రాంగం ప్రభుత్వం చేతిలోనే ఉంది. దానితో నిశబ్ధంగా ఆ పని చేయవచ్చు. కానీ ప్రభుత్వంలో ప్రధానభాగంగా ఉన్న రెవెన్యూశాఖ అవినీతిమయంగా ఉందని స్వయంగా ముఖ్యమంత్రి చెపుతుండటంతో తెరాస సర్కార్ సెల్ఫ్ గోల్ చేసుకొన్నట్లయింది.

కాలిపై కురుపు వచ్చిందని కాలు కోసుకోనట్లే ఏదైనా ప్రభుత్వశాఖలలో అవినీతి జరుగుతున్నట్లు గుర్తిస్తే అవినీతిపరులను గుర్తించి ఏరిపడేయాలి కానీ మొత్తం వ్యవస్థనే తప్పు పట్టడం లేదా రద్దుచేయాలనుకోవడం సరికాదని రెవెన్యూ ఉద్యోగులు అంటున్నారు. మరి ఏలినవారు ఏమి చేస్తారో చూడాలి. 


Related Post