దటీజ్ కేసీఆర్‌!

April 12, 2019


img

సిఎం కేసీఆర్‌ ఇటీవల ఎన్నికల ప్రచార సభలలో మాట్లాడుతూ, కొన్ని గ్రామాలలో పాసుపుస్తకాల కోసం రైతులు పడుతున్న కష్టాలు, స్థానిక అధికారుల అవినీతి బాగోతాలు తన దృష్టికి వచ్చాయని, ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే ఆ సమస్యల పరిష్కారానికి కటినమైన నిర్ణయాలు తీసుకొంటానని చెప్పారు. చెప్పినట్లుగానే శుక్రవారం ప్రగతి భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎస్.కె.జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీనియర్ ఐఎఎస్ అధికారులతో సమావేశమయ్యి ఈ విషయం గురించి చర్చించారు. 

ఈ సందర్భంగా కేసీఆర్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రాభివృద్ధి చేసి, ప్రజలకు సంక్షేమ పధకాలు అందజేసి అందరూ సుఖంగా జీవించాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే, మరోపక్క కొన్ని ప్రభుత్వశాఖలలో కొందరు అవినీతిపరుల కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. వారు చేస్తున్న తప్పులకు ప్రభుత్వం ఎందుకు మాట పడాలి? 

రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతోందంటూ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించవలసిన అవసరం ఉంది. ఇందుకు ఏవో తాత్కాలిక ఉపశమన చర్యలు కాకుండా శాస్వితపరిష్కార మార్గాలు కనుగొనవలసిన అవసరం ఉంది. జాతీయస్థాయిలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వంటిదే రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వంటిది నెలకొల్పడమే దీనికి ఏకైక పరిష్కారమార్గంగా కనిపిస్తోంది. గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు దీనిని రూపొందించుకోవలసిన అవసరం ఉంది. 

ప్రస్తుతం జిల్లాలకు కలెక్టర్ పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో  ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అధ్వర్యంలో పనిచేసే ఐదారుగురు  అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ప్రతీ జిల్లాలో కూడా కలెక్టర్ అధ్వర్యంలో పనిచేసే ఐదారుగురు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వారి ద్వారా గ్రామ పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పూర్తి పారదర్శకంగా, అవినీతిరహితంగా పనులు జరిగేవిధంగా వ్యవస్థను రూపొందించుకోవాలి. 

మనందరి లక్ష్యం ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించడమే కనుక   ప్రజాసమస్యల పరిష్కారానికి, గ్రామపట్టణాభివృద్ధి కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించవలసిందిగా ఉన్నతాధికారులను కోరుతున్నాను,” అని అన్నారు. 

మారుతున్న కాలానికి, పెరుగుతున జనాభాకు అనుగుణంగా వ్యవస్థలను, నియమనిబందనలను, కొత్త చట్టాలను రూపొందించుకోవలసిన అవసరం ఉంటుందని అందరికీ తెలుసు కానీ కేసీఆర్‌ వంటి కొద్దిమంది మాత్రమే చొరవ తీసుకొని ధైర్యంగా ముందడుగు వేస్తుంటారు. పాత వ్యవస్థలను ప్రక్షాళనం చేసి వాటిలో మార్పులు తేవడం ఎంత కష్టమో కొత్తవాటిని నిరంతరంగా...సక్రమంగా పనిచేయించడం అంత కంటే కష్టం. కానీ కష్టమని ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోంటే ప్రజలే ఇబ్బందులు పడుతుంటారు. ఈవిషయం సిఎం కేసీఆర్‌ బాగానే గుర్తించారు కనుక తానే స్వయంగా చొరవ తీసుకొన్నారు. దటీజ్ కేసీఆర్‌.


Related Post