మల్కాజిగిరిలో ఎవరు గెలుస్తారో?

April 12, 2019


img

రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలలో బిజెపి కూడా పోటీ చేసినప్పటికీ సికిందరాబాద్‌, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాలలో తప్ప మిగిలిన అన్ని చోట్లా పోటీ ప్రధానంగా తెరాస, కాంగ్రెస్ పార్టీల మద్యనే సాగిందనేది అందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్యంగా ఓటమిపాలైన రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇద్దరూ టికెట్ సంపాదించుకొని లోక్‌సభకు పోటీ చేశారు. కనుక వారికి ఇది రెండవ అవకాశంగానే భావించవచ్చు. ఒకవేళ ఈసారి గెలిస్తే వారి రాజకీయ జీవితాలు మళ్ళీ గాడిన పడతాయి లేకుంటే భవిష్యత్ అంధకారమే. ఎందుకంటే, ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సగం ఖాళీ అయిపోయింది. బిజెపి కూడా కాంగ్రెస్ పార్టీపై దృష్టి పెట్టింది. మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఎన్నికలు లేవు. ఆలోగా పార్టీలో ఎందరు ఉంటారో ఎందరు వెళ్లిపోతారో ఎవరికీ తెలియదు. కనుక కాంగ్రెస్‌ అభ్యర్ధులలో  ఎంపీలుగా గెలిచినవారు సేవ్ అయిపోతారు కానీ ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా అందరూ 'షేవ్' అయిపోవడం ఖాయం. 

ఈ సంగతి కాంగ్రెస్‌ పార్టీకి, మళ్ళీ పోటీ చేస్తున్న వారికి కూడా బాగా తెలుసు. అందుకే ఈసారి లోక్‌సభ ఎన్నికలలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే ఉద్దేశ్యంతోనే అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డి వంటి బలమైన నేతలకు టికెట్లు కేటాయించింది. వారు కూడా తమ పరిస్థితిని బాగానే అర్ధం చేసుకొన్నారు కనుక లోక్‌సభ ఎన్నికలలో గెలిచేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. 

వారిలో మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్న రేవంత్‌ రెడ్డి ఏటికి ఎదురీదినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే, రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన నేతలలో ఇద్దరో ముగ్గురో మాత్రమే ఆయన తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మిగిలినవారు మల్కాజిగిరివైపు చూడనే లేదు. కనుక రేవంత్‌ రెడ్డి తన స్వశక్తితోనే అక్కడ తెరాసను ఎదుర్కొని గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చివరికి కార్పొరేటర్లు కూడా తెరాసవైపే ఉన్నారు కనుక రేవంత్‌ రెడ్డికి స్థానికంగా రాజకీయ మద్దతు కరువైందని చెప్పవచ్చు. 

కాంగ్రెస్, టిడిపిలవైపు ఉంటారనుకొన్న మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో స్థిరపడిన ఆంధ్రాప్రజలు పోలింగ్ రోజున తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఏపీకి తరలివెళ్ళిపోయారు. ఇక నియోజకవర్గం పరిధిలో బడుగు, బలహీన, నిరుపేద ప్రజలు కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందుతున్న కారణంగా తెరాసవైపే మొగ్గుచూపుతారని వేరే చెప్పక్కరలేదు. 

ఆర్ధికంగా, రాజకీయంగా చాలా బలం ఉన్న మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిని తెరాస బరిలో దింపడంతో రేవంత్‌ రెడ్డి గట్టి సవాలే ఎదుర్కోవలసి వస్తోంది. రేవంత్‌ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మల్కాజిగిరిపై ప్రత్యేకశ్రద్ద పెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపధ్యంలో రేవంత్‌ రెడ్డి మల్కాజిగిరిలో విజయం సాధించడం ఎంత కష్టమో అర్ధం అవుతోంది. కానీ గెలిస్తే మాత్రం అది ఆయన స్వశక్తితో సాధించిన విజయంగానే భావించవచ్చు.


Related Post