హైదరాబాద్‌లో పోలింగ్ శాతం ఎందుకు తగ్గిందంటే...

April 12, 2019


img

తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన మిగిలిన జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్‌, సికిందరాబాద్‌ జంటనగరాలలో పోలింగ్ శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. అందుకు ప్రధాన కారణంగా పోలింగుకు ముందు లేదా వెనుక శలవులు పెట్టుకొని సొంత ఊర్లకో, విహారయాత్రలకో లేదా సినిమాలు షికార్లకో వెళ్ళడమేనని చెప్పవచ్చు. దీనిపై ఎన్ని విమర్శలు వస్తున్నా హైదరాబాద్‌ నగరవాసుల తీరు మాత్రం మారడం లేదు. నిన్న జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కూడా హైదరాబాద్‌లో కేవలం 39.49 శాతం, సికిందరాబాద్‌లో 44.99 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. కానీ ఈసారి పోలింగ్ శాతం పడిపోవడానికి నగరవాసుల బద్దకం కారణం కాదు. గ్రేటర్ పరిధిలో స్థిరపడిన ఆంధ్రాప్రజలకు ఇక్కడ జంటనగరాలలోను, అక్కడ ఏపీలోని తమ సొంత ఊళ్ళలోనూ ఓటు హక్కు ఉందనేది అందరికీ తెలిసిన రహస్యం. 

తెలంగాణలో కేవలం లోక్‌సభ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి కానీ ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నందున, గ్రేటర్ పరిధిలో నివశిస్తున్న ఏపీ ప్రజలు ఈసారి తమ ఓటు హక్కును ఏపీలోనే వినియోగించుకోవాలనుకొన్నారు. కనుక గత మూడు రోజులలో సుమారు 10-12 లక్షలమంది ఏపీలో తమ సొంతూళ్ళకు బయలుదేరడంతో బస్సులు, రైళ్లు, కార్లు అన్నీ కిక్కిరిసిపోవడం అందరూ చూశారు. కనుక ఆ మేరకు జంటనగరాలలో పోలింగ్ శాతం తగ్గిపోయింది. దీని వలన వారినే నమ్ముకొన్న ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులకు చాలా నష్టం కలిగే అవకాశం ఉండవచ్చు. 

ఆంధ్ర ప్రజలు ఎక్కువగా స్థిరపడిన మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా రేవంత్‌ రెడ్డి, బి.మహేందర్ రెడ్డి (జనసేన), సికిందరాబాద్‌ నుంచి అంజన్ కుమార్ యాదవ్ (కాంగ్రెస్‌), నేమూరి శంకర్‌ గౌడ్‌ (జనసేన) హైదరాబాద్‌ నుంచి ఫిరోజ్ ఖాన్ పోటీ చేశారు.


Related Post