ఇక తెలంగాణలో ఆ రెండు పార్టీలే ఉంటాయట!

April 06, 2019


img

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు చాలా ప్రశాంత వాతావరణంలో జరిగాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఈసందర్భంగా ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఉద్దేశ్యించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. త్వరలోనే రాష్ట్రంలో నుంచి కాంగ్రెస్ పార్టీ అదృశ్యమవుతుందని, అప్పుడు రాష్ట్రంలో బిజెపి, తెరాసలు మాత్రమే ఉంటాన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికలలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడం చూస్తే తెలంగాణ ప్రజలలో తెరాస పట్ల విముఖత స్పష్టంగా కనబడుతోందన్నారు. నారాయణగూడ ఇండియన్ బ్యాంకులోని బిజెపి ఖాతాలో నుంచి లెక్క ప్రకారం నగదును తీసుకొంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని అన్నారు. 

తెరాస ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని సగం ఖాళీ చేసేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి కూడా కాంగ్రెస్ పార్టీపై దృష్టి పెట్టినట్లు డికె అరుణ చేరికతో స్పష్టం అయ్యింది. ఈరోజు లక్ష్మణ్ చెప్పిన దానిని బట్టి చూస్తే ఇక నుంచి బిజెపి కూడా కాంగ్రెస్ నేతలను ఫిరాయింపులకు ప్రోత్సహించబోతోందని భావించవచ్చు. ఏ కాంగ్రెస్ పార్టీనైతే తెరాస, బిజెపిలు అవినీతిపార్టీ, అసమర్డుల పార్టీ అని అవహేళన చేస్తున్నాయో అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలనే తమ పార్టీలో చేర్చుకోవడానికి పోటీలు పడుతుండటం హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అవినీతిపరులు, అసమర్దులుగా ఉన్నవారు తెరాస లేదా బిజెపిలో చేరగానే నీతిమంతులు, సమర్ధులుగా మారిపోతారా? అంటే ఇంతకాలంగా కాంగ్రెస్‌లో పేరుకుపోయిన అవినీతి, అసమర్ధత తెరాస, బిజెపిలోకి ప్రవహిస్తున్నాయనుకోవాలా? 

ఒకప్పుడు అన్ని పార్టీలు కాంగ్రెస్‌ అనే మహాసముద్రంలో కలుస్తుండేవి. ఇప్పుడు ఆ మహాసముద్రంలోనుంచి ప్రాంతీయ పార్టీలు తోడుకొంటున్నాయి అంతే తేడా! లక్ష్మణ్ చెపుతున్నట్లు అందరూ తోడుకొంటే సముద్రం ఎండిపోతుందో లేదో చూడాలి.


Related Post