మళ్ళీ మోడీ ప్రధాని అయితే... ఇమ్రాన్ ఖాన్‌ వ్యాఖ్యలు

April 10, 2019


img

భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “భారత్‌లో మళ్ళీ నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి అధికారంలోకి వస్తేనే కశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కశ్మీర్ సమస్యపై చర్చించడానికి వెనుకాడుతుంది కనుక సమస్య యధాతధంగా ఉండిపోతుంది. ఒకప్పుడు భారత్‌లో ముస్లింలు చాలా స్వేచ్ఛగా సుఖంగా జీవించేవారని నాకు తెలుసు కానీ ఇప్పుడు మోడీ హయాంలో తీవ్ర అభద్రతాభావంతో ఉన్నారు,” అని ఇమ్రాన్ ఖాన్‌ అన్నారు. ఒక విదేశీ జర్నలిస్టుల బృందానికి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్‌ ఈవిధంగా అన్నట్లు పాకిస్థాన్‌లోని ప్రముఖ ఆంగ్ల పత్రిక డాన్ ఈరోజు సంచికలో ప్రముఖంగా ప్రచురించింది. 


పాక్‌ భూభాగంపై రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేయించిన నరేంద్రమోడీ మళ్ళీ అధికారంలోకి రావాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ కోరుకోవడం ఆశ్చర్యకరమే. కానీ ఆయన మాత్రమే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలరనే అభిప్రాయం ఆయన మాటలలో కనిపిస్తోంది. తమపై దాడులు చేయించిన నరేంద్రమోడీ మళ్ళీ అధికారంలోకి రావాలని పాక్‌ ప్రధాని కోరుకొంటుంటే, దేశంలో ప్రతిపక్షాలు ఎలాగైనా నరేంద్రమోడీని గద్దె దించాలని పట్టుదలగా ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. 


Related Post