నిజామాబాద్‌ రైతులు అలా ఎందుకు చేశారో...

April 10, 2019


img

నిజామాబాద్‌ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులు తమ పంటలకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ గత రెండు నెలలుగా రకరకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వానికి తమ సమస్యలను నివేదించేందుకు ప్రయత్నించారు. కానీ ప్రభుత్వం వారి సమస్యలను సానుభూతితో చూసేబదులు వారు రాజకీయ దురుదేశ్యంతోనే ఆందోళనలు చేస్తున్నారని ఎదురుదాడి చేయడంతో రైతులు తీవ్రఆవేదనకు ఆగ్రహానికి గురయ్యి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయాలనే సంచలన నిర్ణయం తీసుకొన్నారు. 

అప్పుడు కూడా వారికి అనేక సమస్యలు, సవాళ్ళు ఎదురైనప్పటికీ వాటినన్నటినీ తట్టుకొని 176 మంది రైతులు నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి నామినేషన్లు వేసి బరిలో నిలిచారు. రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇంతటి గుండె నిబ్బరం, ఐఖ్యత ప్రదర్శించడం చాలా అభినందనీయమైన విషయమే. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన మంగళవారం సాయంత్రం వారందరూ ఆర్మూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని మరొక్కసారి తమ సంకల్పబలాన్ని చాటుకొన్నారు. నామినేషన్లు వేసిన ఆ 176 మంది రైతులలో ఒకరిని మాత్రమే ముఖ్య అభ్యర్ధిగా ప్రకటిస్తామని, నామినేషన్లు వేసినవారితో సహా జిల్లాలో రైతులందరూ అతనికే ఓట్లు వేసి గెలిపించాలని కొన్ని రోజుల క్రితం కిసాన్‌ కేత్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. కానీ నిన్న ఆర్మూరులో జరిగిన బహిరంగసభలో ఎవరి పేరు ప్రకటించలేదు. బహుశః అధికార పార్టీ ఒత్తిళ్ళతో వెనుకాడి ఉండవచ్చు లేదా రైతుల ప్రతినిధిగా పోటీ చేయబోతున్న అభ్యర్ధి పేరు బహిరంగంగా ప్రకటిస్తే అతనిని పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగవచ్చనే భయంతో కావచ్చు. కారణాలు ఏవైనప్పటికీ 176 మంది రైతు అభ్యర్ధులు ప్రస్తుతం బరిలో ఉన్నందున జిల్లాలో రైతుల ఓట్లు వారందరి మద్య చీలిపోతాయి కనుక వారిలో ఎవరూ విజయం సాధించలేరు. అప్పుడు పార్లమెంటులో తమ గొంతు వినిపించాలనే వారి ఆశయం కూడా నెరవేరదు. కానీ ఈ ఎన్నికలలో అన్ని పార్టీలకు రైతుల సంఘటితశక్తిని రుచి చూపించగలిగామని సంతృప్తిపడవలసి ఉంటుంది.


Related Post