పుల్వామా జవాన్ల కోసం బిజెపికి ఓటు వేయాలా!

April 10, 2019


img

పుల్వామా ఉగ్రదాడిలో జవాన్లు చనిపోతే అందుకు యావత్ భారతీయులు ఎంతో బాధపడ్డారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ వారి పేరు చెప్పుకొని బిజెపికి ఓట్లు వేయమని అడిగారు. అలాగే భారత వాయుసేన ప్రాణాలకు తెగించి చేసిన వైమానిక దాడుల క్రెడిట్ కూడా బిజెపికి ఆపాదించుకొని ఓట్లు అడిగారు. 

ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొన్నప్పుడు ఈ రెండు అంశాలను ప్రధానంగా ప్రస్తావించి, కొత్తగా ఓటు హక్కు పొందిన యువతను బిజెపికి ఓటు వేయవలసిందిగా కోరారు. తద్వారా ఎన్నికలలో లబ్ది పొందేందుకే మోడీ ప్రభుత్వం వైమానిక దాడులు నిర్వహించిందన్న ప్రతిపక్షాల ఆరోపణలను దృవీకరించినట్లయింది. 

ఇంతకీ ప్రధాని మోడీ ఏమన్నారంటే, “తొలిసారిగా ఓటు వేస్తున్న మీరందరూ పుల్వామాలో అమరులైన మన వీర జవాన్లకు వేయగలరా? వైమానిక దాడులు నిర్వహించినవారికి మీ తొలి ఓటు వేయగలరా? అంతరిక్షంలో ఉపగ్రహాన్ని కూల్చి చూపించి మన దేశం శక్తి సామర్ధ్యాలను యావత్ ప్రపంచానికి చాటిచెప్పినవారికి ఓటు వేయగలరా?      తద్వారా మీ మొదటి ఓటునే దేశానికి అంకితం చేసినట్లవుతుంది. అది ఎన్నటికీ మీకు గుర్తుండిపోతుంది,” అని అన్నారు. 

తన ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా చెప్పుకొని ప్రధాని నరేంద్రమోడీ ప్రజలను ఓట్లు అడిగారు. దానిని ఎవరూ తప్పు పట్టరు కానీ పుల్వామాలో చనిపోయిన జవాన్ల పేరు చెప్పుకొని, వాయుసేన దాడుల గురించి చెప్పుకొని ఓట్లు అడగడటమే అభ్యంతరకరం. ఇది ఎన్నికల నిబందనలకు విరుద్దం కూడా. కానీ ప్రధానిపై చర్యలు తీసుకొనే ధైర్యం మన ఎన్నికల సంఘానికి ఉందా?


Related Post