మా గోస మీకు రాజకీయాలుగా కనిపించిందా? నిజామాబాద్‌ రైతులు

April 09, 2019


img

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి నామినేషన్లు వేసిన 176 మంది పసుపు, ఎర్రజొన్న రైతులకు మద్దతుగా మంగళవారం సాయంత్రం ఆర్మూర్‌లో జరిగిన రైతు ఐక్యత సభ జిల్లాలో వందలాది గ్రామాలనుంచి భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు.

ఆ సభలో రాష్ట్ర కిసాన్‌ కేత్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి రైతులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “గత రెండు నెలలుగా పసుపు, ఎర్రజొన్నలకు మద్దతుధర ఇప్పించాలని మనం ధర్నాలు చేశాం..భార్యాబిడ్డలతో వచ్చి రోడ్లపై వంటలు వండుకొని నిరసన తెలియజేశాము. మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకొనేందుకు మనకు చేతనైన విధంగా అన్ని ప్రయత్నాలు చేశాము. కానీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు. తెరాసతో సహా ఏ పార్టీ కూడా స్పందించలేదు. 

మనం కడుపుమండి రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే మన ఉద్యమాన్ని కించపరిచేవిధంగా కేటీఆర్‌, కవిత మాట్లాడారు. మనల్ని ఒక రాజకీయపార్టీ వెనుక నుంచి ప్రోత్సహిస్తే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నామని అన్నారు. మనం రైతులమా కాదన్నట్లు మాట్లాడారు. ఇదేనా రైతులకు మీరిచ్చే గౌరవం? మేము అడుగుతున్నది కేవలం మా కష్టానికి తగిన ప్రతిఫలం తప్ప మరేమీ అడగడం లేదు కదా? అడిగితే రాజకీయం చేస్తున్నామని ఎందుకు అంటున్నారు?మన ఉద్యమాన్ని కించపరిచినట్లు మాట్లాడుతున్నవారికి లోక్‌సభ ఎన్నికలలో రైతులందరూ తగిన గుణపాఠం చెప్పాలి. అప్పుడే మన శక్తి ఏమిటో వారికి అర్ధం అవుతుంది.  

పసుపుకు క్వింటాలుకు రూ.10,000 మద్దతు ధర ఇప్పిస్తానని లేకుంటే ఓట్లు అడగనని చెప్పిన తెరాస ఎంపీ కవితక్క ఇప్పుడు పసుపుకు మద్దతుధర ప్రకటించే అంశం తమ పరిధిలో లేదని చేతులు దులుపుకొన్నారు. తన పరిధిలో లేని అంశామని తెలిసి ఉన్నప్పుడు ఆనాడు ఆమె ఎందుకు ఆవిధంగా హామీ ఇచ్చారు? మనకు న్యాయం చేయలేకపోగా  మనల్ని అవమానిస్తున్నారు. 


ఇప్పుడు ఎన్నికలొచ్చాయి కనుక అన్ని పార్టీలు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మళ్ళీ హామీలు ఇస్తున్నాయి. మరి ఇదే పని నాలుగేళ్ల క్రిందటే ఎందుకు చేయలేదు? నాలుగేళ్లుగా చేయనిది ఇప్పుడు చేస్తారనే నమ్మకం ఏమిటి? మనం అందరం ఐకమత్యంగా ఉన్నాము కనుకనే ఇప్పుడు అన్ని పార్టీలు మన సమస్య గురించి మాట్లాడుతున్నాయి. లేకుంటే పట్టించుకొనేవా? 

తెలంగాణ ప్రభుత్వం పోలీసుల ద్వారా కొంతమంది రైతులను భయపెట్టి నామినేషన్లు వేయకుండా అడ్డుకోగలిగింది. అయినా 176 మంది నామినేషన్లు వేసి మన ఐక్యతను, శక్తిని చాటుకొన్నాము. ఇప్పటికీ పాలకులు కళ్ళు తెరువకపోతే రేపు జరుగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా ఇదేవిధంగా రైతులు నామినేషన్లు వేసి నిరసన తెలుపుదాము,” అని అన్నారు.


Related Post