మేమెవరికీ బీ-టీం కాదు: ఓవైసీ

April 09, 2019


img

మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు చేశారు. “అచ్చేదిన్..అచ్చేదిన్.. అని ప్రధాని నరేంద్రమోడీ అంటుంటారు కానీ అవెప్పుడు వస్తాయి? దేశ ప్రజలందరినీ సమానంగా చూడవలసిన ఆయన ప్రజల మద్య మతాల పేరుతో చిచ్చుపెట్టి ఎన్నికలలో లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారు. మైనార్టీలపై కపటప్రేమ ఒలకబోసే ప్రధాని నరేంద్రమోడీ, వారికి రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ శాసనసభ తీర్మానం చేసి పంపించితే ఎందుకు పక్కనపడేశారు? మోడీ కేవలం ఆర్.ఎస్.ఎస్. విధానాలనే అమలుచేస్తున్నారు తప్ప స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు. మోడీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేస్తున్న బడా వ్యాపారులకే చౌకీదారుగా వ్యవహరిస్తున్నారు. మా పార్టీ ఏ పార్టీకి బీ-టీం లేదా సీ-టీం కాదు,” అని అన్నారు. 

కేంద్రం ఆమోదిస్తే తప్ప మైనార్టీలకు రిజర్వేషన్ల శాతం పెంచడం సాధ్యం కాదనే సంగతి కేసీఆర్‌ కంటే అసదుద్దీన్ ఓవైసీకే బాగా తెలుసు. కనుక ఈ విషయంలో ఆయన ముందుగా కేసీఆర్‌ను ప్రశ్నించాలి కానీ ప్రధానిమోడీని నిందిస్తున్నారు.    

తాము బిజెపికి బీ-టీం కాదని తెరాస కూడా చెప్పుకొంటుంది. కానీ నరేంద్రమోడీ-కేసీఆర్‌ మద్య స్నేహం...ఆ కారణంగా మోడీ ప్రభుత్వానికి తెరాస అండగా నిలబడుతుండటం అందరికీ తెలిసిందే. మజ్లీస్ ఇంతగా వ్యతిరేకిస్తున్న మోడీతో కేసీఆర్‌ దోస్తీ చేస్తున్నప్పటికీ మజ్లీస్ అధినేతకు అది తప్పుగా అనిపించలేదు. లోక్‌సభ ఎన్నికల తరువాత అవసరం పడితే నరేంద్రమోడీకి తెరాస మద్దతు ఇస్తుందనే సంగతి కూడా ఓవైసీకి తెలుసు. అంటే బిజెపికి తెరాస బీ-టీం అనుకొంటే, మజ్లీస్ సీ-టీం అనే అనుకోవాలి కదా? 

రాష్ట్రంలో, దేశంలో ముస్లింలకు మజ్లీస్ ఏకైక ప్రతినిధి అన్నట్లుగా మాట్లాడుతున్న ఓవైసీ సోదరులు ఎప్పుడూ తమ పదవులు, అధికారం, రాజకీయాలే తప్ప రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి అసలు ఏమి చేశారు? వారిరువురూ హైదరాబాద్‌ పాతబస్తీ దాటి ఏనాడూ రాష్ట్రంలో వివిద జిల్లాలలో పర్యటించి అక్కడి ముస్లిం ప్రజల బాగోగులు తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే తెరాసకు దాని అధినేత కేసీఆర్‌కు ఆగ్రహం కలుగుతుంది. తమ రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దానితో స్నేహం చేసే మజ్లీస్ పార్టీ తామెవరికీ బీ, సీ టీం కాదని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది.


Related Post