లోక్‌సభ ఎన్నికల తరువాత?

April 09, 2019


img

మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. వాటితో పాటే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఫలితాలు కూడా వెలువడతాయి. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉంటే ఏమి జరుగవచ్చు? అని ఆలోచిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు కనబడతాయి.

ఒకవేళ కేంద్రంలో మళ్ళీ బిజెపి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చినట్లయితే తెరాస 16 ఎంపీ సీట్లు గెలుచుకొన్నా కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. మళ్ళీ యధాప్రకారం కేసీఆర్‌-మోడీ స్నేహం కొనసాగుతుంది. ఒకవేళ కాంగ్రెస్‌ పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని నామరూపాలు చేసినందుకుగాను తెరాసపై ప్రతీకారం తీర్చుకొనే ప్రయత్నం చేయవచ్చు. పనిలోపనిగా రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేయవచ్చు. 

కేసీఆర్‌ చెపుతున్నట్లుగా ఒకవేళ కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రభుత్వ ఏర్పాటుకు తగినంతమంది ఎంపీలు లభించనట్లయితే, ఆ రెంటిలో దేనికి ఎక్కువ సీట్లు వచ్చాయనేదాని ఆధారంగా కేసీఆర్‌, చంద్రబాబునాయుడు పాత్ర ఉంటుంది. ఒకవేళ బిజెపికి ఎక్కువ వస్తే కేసీఆర్‌, కాంగ్రెస్‌కు ఎక్కువ వస్తే చంద్రబాబు కీలకమవుతారు. 

ఒకవేళ ఆ రెంటికీ ఇంకా తక్కువ సీట్లు వచ్చినట్లయితే, అప్పుడు ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. కానీ అప్పుడు కూడా కేసీఆర్‌, చంద్రబాబు ఇద్దరిలో ఎవరు ఎన్ని పార్టీలను తమవైపు తిప్పుకోగలరనే దానిపైనే బలాబలాలు ఉంటాయి. 

ఆ పరిస్థితులలో ఫెడరల్‌ ఫ్రంట్‌లో ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరనేది కూడా చాలా కీలకమవుతుంది. ప్రధాని అభ్యర్ధి విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి రాగలిగితే కాంగ్రెస్‌, బిజెపిలకు ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంటుంది. కానీ అదే చాలా కష్టం. 

ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ గెలిస్తే, రెండు తెలుగు రాష్ట్రాల మద్య సంబంధాలు మెరుగవవచ్చు. అప్పుడు విభజన సమస్యలు కూడా పరిష్కారమవవచ్చు. లోక్‌సభ ఎన్నికలలో వైసీపీ 20-22 ఎంపీ సీట్లు గెలుచుకొన్నట్లయితే కేసీఆర్‌కు బలం పెరుగుతుంది కనుక అప్పుడు ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలను ఫెడరల్‌ ఫ్రంట్‌లో రప్పించడం సులువవుతుంది. 

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఒకవేళ టిడిపి ఓడిపోయినట్లయితే, ఇక డిల్లీలో కేసీఆర్‌కు చంద్రబాబునాయుడు నుంచి ఎటువంటి ఇబ్బంది, సవాళ్ళు ఉండవు. అదే...ఏపీలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తే షరా మామూలుగా ఇరువురు ముఖ్యమంత్రులు...రెండు ప్రభుత్వాల మద్య, రెండుపార్టీల మద్య ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంటుంది.


Related Post