తెరాస-16, కాంగ్రెస్‌-8, మజ్లీస్-1, బిజెపి?

April 09, 2019


img

ఈనెల 11న రాష్ట్రంలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో మజ్లీస్-1, తెరాస 16 సీట్లు గెలుచుకొంటాయని చెప్పుకొంటుంటే, కాంగ్రెస్ పార్టీ కనీసం 8-9 సీట్లు గెలుచుకొంటుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి కుష్బూ నమ్మకంగా చెపుతున్నారు. బిజెపి ఎన్ని సీట్లు గెలుచుకోగలదో ఖచ్చితంగా చెప్పలేకపోతోంది కానీ గెలుపుకోసం భారీగానే ఖర్చు చేస్తోందని నిన్న బిజెపి వ్యక్తుల వద్ద పట్టుబడ్డ రూ.8 కోట్లతో స్పష్టమైంది. 

తెరాస గెలిస్తే కేసీఆర్‌ ప్రధానమంత్రి అవుతారని, కేంద్రప్రభుత్వం ఏర్పాటులో నిర్ణయాత్మక శక్తిగా అవతరిస్తారని, కేంద్రాన్ని శాశించి నిధులు, ప్రాజెక్టులు సాధించుకోగలమని తెరాస చేస్తున్న వాదనలో పసలేదని ప్రజలకు అర్ధమవుతున్నప్పటికీ, కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలకంటే తెరాస ఎంపీలే తెలంగాణ కోసం డిల్లీలో గట్టిగా కొట్లాడగలరని రుజువైనందున ప్రజలు తెరాస అభ్యర్ధులవైపే ఎక్కువ మొగ్గు చూపవచ్చు.

రాహుల్ గాంధీ ప్రధాని అయితే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే కాంగ్రెస్‌ వాదనలను ప్రజలెవరూ నమ్ముతారనుకోలేము. అయితే తెరాసను గెలిపిస్తే ఎన్నికల తరువాత బిజెపికే మద్దతు ఇవ్వడమో లేక దానితో అంటకాగుతుందని కొందరు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపవచ్చు. 

ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా బిజెపికి తెలంగాణలో ఓటమి తప్పకపోవచ్చు. కానీ సికిందరాబాద్‌, మహబూబ్‌నగర్‌ రెండు నియోజకవర్గాలలో కిషన్ రెడ్డి, డికె.అరుణలలో ఎవరో ఒకరు లేదా ఇద్దరూ విజయం సాధించే అవకాశం ఉంది. కనుక లోక్‌సభ ఎన్నికలలో తెరాస:12-13, కాంగ్రెస్: 3-4, బిజెపి:1-2, మజ్లీస్: 1 సీట్లు గెలుచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Related Post