కేసీఆర్‌ అలా బయటపడ్డారు...

April 09, 2019


img

“ఏపీ రాజకీయాలతో మాకేం పని. వాటిపై మాకేమీ ఆసక్తి లేదు...ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా మాకేమీ ఇబ్బంది లేదు,” అని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చెప్పినప్పటికీ, వైసీపీకి దాని అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి తెరాస మద్దతు ఇస్తోందనే విషయం అందరికీ తెలుసు. జగన్ స్వయంగా ఈ విషయం బయటపెట్టుకొన్నారు కానీ తెరాస ఇంతవరకు బయటపడలేదు. కానీ సోమవారం వికారాబాద్‌లో జరిగిన తెరాస ఎన్నికల ప్రచార సభలో సిఎం కేసీఆర్‌ స్వయంగా వైసీపీకి తమ పార్టీ మద్దతు ఇస్తోందనే విషయం బయటపెట్టారు. 

ఏ‌పీకి ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న కేసీఆర్‌తో దోస్తీ చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నికలలో ఓడించాలని టిడిపి చేస్తున్న ప్రచారంతో వైసీపీకి నష్టం కలగవచ్చునని గ్రహించిన సిఎం కేసీఆర్‌ నిన్న సభలో మాట్లాడుతూ, “ఏ‌పీకి ప్రత్యేకహోదా వస్తుందంటే మేమూ సంతోషిస్తాము. ఏ‌పీకి ప్రత్యేకహోదా సాధించడం కోసం తెరాస మద్దతు ఇస్తుంది. సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీటిని వాడుకొనేందుకు ఏపీ ప్రభుత్వం దిగువన పోలవరం ప్రాజెక్టు కట్టుకొంటుంటే మాకెందుకు అభ్యంతరం?మేము బాగుండాలి మాతో పాటు అందరూ బాగుండాలి అని కోరుకొనేవాళ్లం మేము. ఏపీలో చంద్రబాబునాయుడు దుకాణం త్వరలోనే బంద్‌ కాబోతోంది. అది గ్రహించిన చంద్రబాబు ఆందోళనతో నోటికి వచ్చినట్లు నన్ను తిడుతున్నారు. ఏపీలో వైసీపీకి 20-22 ఎంపీ సీట్లు వస్తాయని భావిస్తున్నాం. లోక్‌సభ ఎన్నికలలో మా రెండు పార్టీలకు కలిపి 36-38 ఎంపీ సీట్లు వరకు వస్తాయి. అప్పుడు దేశంలో ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలను కలుపుకొని కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఆవిర్భవిస్తాము,” అని అన్నారు. 

ప్రత్యేకహోదా, పోలవరం అంశాలలో తెరాస వైఖరి మొదటి నుంచి స్పష్టంగానే ఉంది. ఆ రెంటినీ తెరాస గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే తెరాస నేతలు ఏ‌పీకి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణలో పరిశ్రమలు ఏపీకి తరలిపోతాయని దాని వలన తెలంగాణకు తీరని నష్టం వాదించారు. పోలవరంపై అభ్యంతరాలు తెలుపుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. కానీ ఇప్పుడు ఏపీలో జగన్‌కు నష్టం కలగకూడదనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్‌ ఈవిధంగా మాట్లాడారు తప్ప నిజంగా కాదని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. జగన్‌కు మేలు చేకూర్చాలనే తాపత్రయంతో కేసీఆర్‌ వాటి గురించి మాట్లాడి తమ మద్య బలమైన బందం ఉందనే సంగతి స్వయంగా బయటపెట్టుకొన్నారు. సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు కేసీఆర్‌ చేసిన ఈ ప్రకటన వలన ఏపీలో వైసీపీకి లాభమే చేకూరుతుందో లేక నష్టపోతుందో చూడాలి. 



Related Post