దేశానికి తెలంగాణ ఫార్ములా అవసరమే కానీ...

April 08, 2019


img

కేవలం 5 ఏళ్ళ వ్యవదిలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలవడం మనమందరం గర్వించవలసిన విషయమే. రాష్ట్రంలో అమలవుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కేంద్రప్రభుత్వంతో సహా అనేక రాష్ట్రాలకు ప్రేరణనిస్తున్నాయి. కేవలం 5 ఏళ్ళ వ్యవదిలో ఇవన్నీ ఏవిధంగా సాధ్యం అయ్యాయనే ప్రశ్నకు సమాధానం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. సమర్ధమైన నాయకత్వం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన, చిత్తశుద్ధి, దూరదృష్టి కలిగిన పాలకులు, రాజకీయ సుస్థిరత మొదలైన అంశాలు ఇందుకు దోహదపడ్డాయని అందరికీ తెలుసు. 

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే ఇప్పుడు దేశాన్ని కూడా అభివృద్ధి చేసి ప్రగతిబాట పట్టిస్తామని సిఎం కేసీఆర్‌ చెపుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించారు కనుక ఆయన మాటలపై  ప్రజలకు కూడా నమ్మకం కలగడం సహజం. కానీ తెలంగాణ స్థాయిలో సాధించగలిగినది జాతీయ స్థాయిలో సాధించాలంటే ముందుగా కేంద్రంలో సుస్థిరమైన, బలమైన ప్రభుత్వం ఏర్పడవలసి ఉంది. ఆ తరువాత దానిలో దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన, చిత్తశుద్ధి, దూరదృష్టి కలిగిన పాలకులు కలిగి ఉండాలి.  

కానీ తెరాస వాదన ప్రకారం లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌, బిజెపిలలో దేనికీ మెజార్టీ రాదు. కనుక ప్రాంతీయపార్టీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తుంది. అంటే అవకాశవాద ప్రాంతీయ పార్టీలతో కూడిన అస్థిరమైన ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని భావించవలసి ఉంటుంది. 

ఇక ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగస్వాములుగా ఉండబోయే పార్టీలని భావిస్తున్నవాటిలో తెరాస అధినేత కేసీఆర్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రధానమంత్రి రేసులో ఉన్నారు. కనుక అధికారదాహంతో చేతులు కలుపుతున్న పార్టీలతో ఏర్పడే అస్థిరమైన ప్రభుత్వంతో దేశంలో గుణాత్మకమైన మార్పు సాధించడం సాధ్యమేనా? అనే ప్రశ్నకు కేసీఆరే సమాధానం చెప్పవలసి ఉంది. 

తెలంగాణలో కేసీఆర్‌ చేతిలోనే సంపూర్ణాధికారాలున్నాయి కనుక తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపగలిగారు. కానీ ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగస్వామిగా ఉంటారని భావిస్తున్న జగన్, ఏ‌పీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ముందే డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఫెడరల్‌ ఫ్రంట్‌లోని వివిద రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలకు డిమాండ్లు ఉంటాయి. వాటిని నెరవేర్చితేనే మద్దతు ఇస్తాయి లేకుంటే మద్దతు ఉపసంహరించుకోవచ్చు. అంటే అస్థిరమైన, బలహీనమైన ప్రభుత్వంగా మారే అవకాశం ఉందన్న మాట!

అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏవిధంగా సుస్థిరమైన, బలమైన ప్రభుత్వం ఉందో అలాగే కేంద్రంలో కూడా బలమైన, సమర్ధమైన ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్‌ చెపుతున్న ఆ మార్పు సాధ్యం అని భావించవచ్చు. రాష్ట్రంలో బలమైన, సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలని కోరుకొంటున్న తెరాస, కేంద్రంలో మాత్రం అస్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని... అప్పుడు తాము చక్రం తిప్పాలని కోరుకోవడం ఆశ్చర్యకరమే.


Related Post