కేసీఆర్‌కు జగన్ రిటర్న్ గిఫ్ట్?

April 08, 2019


img

లోక్‌సభ ఎన్నికల తరువాత వైసీపీతో కలిపి వివిద రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలకు చెందిన సుమారు 150 మంది ఎంపీలు ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగస్వాములుగా చేరుతారని, కనుక జాతీయ రాజకీయాలలో ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలకపాత్ర పోషించబోతోందని కేసీఆర్‌, కేటీఆర్‌ తదితర తెరాస నేతలు చెపుతున్నారు. కానీ వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, “ఏ‌పీకి ప్రత్యేకహోదా ఎవరిస్తారో వారికే వైసీపీ మద్దతు ఇస్తుంది,” అని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున ఏ‌పీకి ప్రత్యేకహోదా విషయంలో తెరాస కాస్త మెతకవైఖరి ప్రదర్శిస్తున్నప్పటికీ, ఏ‌పీకి ప్రత్యేకహోదా ఇవ్వడానికి కేసీఆర్‌ వ్యతిరేకమనే సంగతి అందరికీ తెలిసిందే. 

అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి కూడా ఏ‌పీకి ప్రత్యేకహోదా ఇవ్వబోదని స్పష్టమైంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ‌పీకి ప్రత్యేకహోదా ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. 

ఒకవేళ ఏపీలో టిడిపి అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకొన్నట్లయితే అప్పుడు జగన్ ఎవరికి మద్దతు ఇచ్చినా పెద్ద తేడా ఉండదు. కానీ ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి, వైసీపీ అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకొన్నట్లయితే, తన విజయానికి ఎంతగానో సహకరించిన సిఎం కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్టుగా ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరుతారా లేదా?అనే విషయం తేలాల్సిఉంది. 

ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా ప్రస్తుత పరిస్థితులలో ఏ‌పీకి ప్రత్యేకహోదా ఇస్తుందా లేదా...అసలు అది సాధ్యమా కాదా? అనే విషయాన్ని పక్కనపెడితే, దాని కోసం జగన్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారా లేక హోదాను వ్యతిరేకిస్తున్న కేసీఆర్‌కు మద్దతు ఇస్తారా అనేది లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడితే గానీ తెలియదు.


Related Post