ప్రధాని మాట్లాడే మాటలేనా ఇవి? కేసీఆర్‌

April 08, 2019


img

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగింపుదశకు చేరుకొంటున్నకొద్దీ అన్ని పార్టీలు తీవ్రస్థాయిలో పరస్పరవిమర్శలు చేసుకొంటున్నాయి. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన తెరాస ఎన్నికల ప్రచారసభలో ప్రధాని నరేంద్రమోడీపై సిఎం కేసీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. 

“బిజెపి అధికారంలోకి వస్తే ప్రతీ పేదవాడి కుటుంబం ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్నారు. కనీసం రూ.15లైనా వేశారా?ఎన్నికలు రాగానే బిజెపికి హిందూ, ముస్లింల మద్య చిచ్చు పెట్టడం ఒక దూరాలవాటుగా మారిపోయింది. ఎన్నికలొచ్చినప్పుడే మీకు రామమందిరం, హిందూ, ముస్లింలు గుర్తొస్తాయా? తెలంగాణలో దశాబ్ధాలుగా హిందూ ముస్లింలు కలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారు. పండుగలు జరుపుకొంటున్నారు. బిజెపి నేతలు వారి మద్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ప్రధానమంత్రి దేశం, ప్రజల సమస్యల గురించి లేదా విధానపరమైన అంశాల గురించి మాట్లాడాలి కానీ ‘నాది పెద్ద ముక్కు... వాస్తు, జాతకాల పిచ్చి...యజ్ఞాలు హోమాలు చేస్తుంటారు’ అని వ్యక్తిగతస్థాయిలో విమర్శలు చేయడం ఏమిటి? అయినా నేను ఏవిధంగా ఉంటే మీకెందుకు? మీ కంటే చక్కగానే రాష్ట్రాన్ని పాలిస్తున్నాను... అభివృద్ధి చేస్తున్నాను....ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు కదా?చైనా, సింగపూర్ వంటి దేశాలలో రోడ్లు, రైలు మార్గాలు వంటి మౌలికవసతులు ఎంతగానో అభివృద్ధి చెందాయి కానీ మనదేశంలో 70 ఏళ్ళుగడిచినా ఎటువంటి మార్పు రాలేదు. ఇది మీ వైఫల్యం కాదా?అందుకే కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా  నేను ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి జాతీయరాజకీయాలలో ప్రవేశించాలని నిర్ణయించుకొన్నాను. ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం దేశానికి దశ, దిశ మార్చి చూపిస్తుంది,” అని అన్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ తనను విమర్శించినందుకు బాధపడి కేసీఆర్‌ ఈవిధంగా అన్నారో లేక ప్రధాని మోడీ తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని చెప్పుకొంటూ ప్రజలలో సానుభూతి పొంది లోక్‌సభ ఎన్నికలలో లబ్దిపొందాలని ప్రయత్నిస్తున్నారో తెలియదు కానీ తాను కాంగ్రెస్‌ నేతలను దద్దమ్మలు, చవటలు, సన్నాసులు అని తిట్టిన సంగతి మరిచినట్లున్నారు. సాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఉద్దేశ్యించి కేసీఆర్‌ ఎంత అనుచితంగా మాట్లాడారో అందరికీ తెలిసిం ఇతరులను తిట్టిపోసినప్పుడు, అవహేళనగా మాట్లాడినప్పుడు తప్పుగా అనిపించనప్పుడు, ప్రధానిమోడీ లేదా ప్రతిపక్ష నేతలు విమర్శిస్తే ఆగ్రహం ఎందుకు?

అధికారంలో ఉన్నవారు హూందాగా ప్రవర్తిస్తే, ప్రతిపక్షాలు కూడా హుందాగా ప్రవర్తిస్తాయి. కానీ అధికారంలో ఉన్నవారు ఒక మెట్టు దిగితే ప్రతిపక్షాలు నాలుగు మెట్లు దిగి విమర్శించకమానవు. కనుక రాజకీయాలనే అద్దాలమేడలో ఉంటున్నవారు ఇతరులపై రాళ్ళు రువ్వితే వారికే నష్టం అని గ్రహిస్తే మంచిది. 


Related Post