అతను ఎన్నటికీ ప్రధాని కాలేడు: మేనకా గాంధీ

April 07, 2019


img

యూపీయే చైర్ పర్సన్ సోనియా గాంధీ తోడికోడలు మేనకాగాంధీ రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలను ఉద్దేశ్యించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యూపీలోని సుల్తాన్ పూర్ నుంచి బిజెపి లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆమె నిన్న ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, “ఏదో ఊహించలేని అద్భుతం జరిగితే తప్ప రాహుల్ గాంధీ తన జీవితంలో ఎన్నటికీ ప్రధానమంత్రి కాలేరు. అతను మోడీకి ఏ విషయంలోనూ సాటికాడు...ఆయనతో పోటీపడలేడు. కనుక దేశప్రజలు మళ్ళీ నరేంద్రమోడీకే అధికార పగ్గాలు అప్పగించబోతున్నారు,” అని అన్నారు. 

ప్రియాంకా వాద్రాను ప్రత్యక్ష రాజకీయాలలో దింపి, లోక్‌సభ ఎన్నికలలో తూర్పు యూపీ కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగించడం గురించి ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ప్రియాంకా వాద్రా చాలా జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పటికీ యూపీ ప్రజలను ఆమె ప్రభావితం చేయగలరని నేను భావించడం లేదు, “ అని మేనకా గాంధీ అన్నారు. 

లోక్‌సభ ఎన్నికలలో కూడా దేశప్రజలు ప్రాంతీయ, జాతీయ పార్టీల అధినేతలను, వాటి అభ్యర్ధుల పనితనం, బలాబలాలను పరిగణనలోకి తీసుకొని ఓట్లు వేస్తుంటారు. అయితే ప్రధానంగా ఏ పార్టీకి ఓటేస్తే ఎవరు ప్రధానమంత్రి అవుతారనేది ఎక్కువగా గమనిస్తారని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి వేస్తే రాహుల్ గాంధీ, బిజెపికి వేస్తే నరేంద్రమోడీ ప్రధానమంత్రి అవుతారని స్పష్టంగా అందరికీ తెలుసు. కనుక ఒకవేళ వారిరువురిలో ఎవరైనా ప్రధాని కావాలని దేశప్రజలు కోరుకొంటే, ఆ పార్టీలకు లేదా వాటికి మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీలకు ప్రజలు ఓట్లు వేస్తారు. వారిరువురూ వద్దనుకొన్నవారు ప్రత్యామ్నాయ కూటమి లేదా స్థానికంగా బలంగా ఉన్న పార్టీలకు ఓట్లు వేసే అవకాశం ఉంది. నరేంద్రమోడీ-రాహుల్ గాంధీలలో ఎవరు బెటర్ అని దేశప్రజలు ఆలోచిస్తే మాత్రం  మేనకా గాంధీ చెప్పినట్లు బిజెపికి, దానితో కలిసి పనిచేస్తున్న పార్టీలకే ఓట్లు పడే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.


Related Post