మేమే కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: మమతా బెనర్జీ

April 07, 2019


img

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలోని జల్పాయ్‌గురిలో శనివారం ఎన్నికల ప్రచారం చేస్తూ ‘లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ఓడిపోవడం ఖాయమని, అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని’ చెప్పారు. 

ఆమె ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగస్వామిగా ఉంటారని కేసీఆర్‌ చెపుతుంటే, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపీయే కూటమిలో ఉంటారని చంద్రబాబునాయుడు చెపుతున్నారు. ఇటీవల ఆమె చంద్రబాబునాయుడుకు మద్దతుగా ఏపీలో ఎన్నికల ప్రచారం కూడా చేయడంతో ఆమె కాంగ్రెస్‌పక్షంలో ఉండే అవకాశం ఉందని అర్ధమవుతోంది. కాంగ్రెస్‌ నేతృత్వంలో పనిచేయడమంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా అంగీకరించడమే. కానీ ఆమె తన పార్టీ నేతృత్వంలోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పడంతో తాను కూడా ప్రధానమంత్రి రేసులో ఉన్నానని చెప్పినట్లయింది. 

తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఫెడరల్‌ ఫ్రంట్‌ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోందని కేసీఆర్‌ చెపుతున్నారు. తనకు ప్రధానమంత్రి పదవిపై ఆశలేదని కేసీఆర్‌ చెపుతున్నప్పటికీ, దేశప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకొంటున్నారనే తెరాస నేతల మాటలు ఆయన కూడా ప్రధాని రేసులో ఉన్నారని స్పష్టం చేస్తోంది. కానీ ఆయన నరేంద్రమోడీకి మద్దతు కూడగట్టేందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుచేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు. 

కనుక మమతా బెనర్జీ, కేసీఆర్‌ ఇద్దరూ కూడా లోక్‌సభ ఎన్నికల తరువాత ఎటువైపు ఉంటారో, ఎవరికి ఎవరు మద్దతు ఇస్తారో తెలియనీయకుండా కేంద్రంలో తామే చక్రం తిప్పుతామని చెపుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడితే కానీ ఈ సస్పెన్స్ వీడదు.


Related Post