వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా శాసనసభకు పోటీ చేసిన వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి), సీనియర్ టిడిపి నేత మండవ వేంకటేశ్వరరావు తెరాసలో చేరిపోయారు. వారితో పాటు హైదరాబాద్ నగర టిడిపి అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ తదితరులు కూడా తెరాసలో చేరిపోయారు. శనివారం ప్రగతి భవన్‌లో వారందరికీ సిఎం కేసీఆర్ గులాబీకండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ అధిష్టానం మొదట వద్దిరాజు రవిచంద్రకు ఖమ్మం లోక్‌సభ టికెట్ కేటాయించింది. కానీ చివరి నిమిషంలో ఆయన స్థానంలో రేణుకా చౌదరిని బరిలో దింపడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. దాంతో ఆయన తెరాసలోకి వెళ్ళిపోయారు. ఎన్నికలకు ముందు ఆయన తెరాసలో చేరడంతో ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్-తెరాస బలాబలాలో కూడా మార్పులు రావడం సహజం. నిజానికి కాంగ్రెస్ టికెట్ లభించి ఉండి ఉంటే తెరాస అభ్యర్ధితో పోరాడవలసిన ఆయన, ఇప్పుడు తెరాసలో చేరడంతో కాంగ్రెస్ అభ్యర్ధి రేణుకా చౌదరిని ఓడించేందుకు తెరాసకు సహకరించబోతున్నారు.