అద్వానీ చురకలు...మోడీ కృతజ్ఞతలు!

April 05, 2019


img

బిజెపి వ్యవస్థాపక సభ్యుడు, మాజీ అధ్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ పార్టీ సిద్దాంతాలను వివరిస్తూ పరోక్షంగా ప్రధాని నరేంద్రమోడీకి చురకలు వేశారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో అద్వానీని పక్కనబెట్టి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్నారు. 

దీంతో సహజంగానే తీవ్ర అసంతృప్తికి గురైన అద్వానీ, ఏప్రిల్ 6వ తేదీన బిజెపి వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని తన బ్లాగులో ‘బిజెపి సిద్దాంతాల’ గురించి వివరించారు. దానిలో ఎక్కడా ప్రధానిమోడీ, అమిత్ షా పేర్లను ప్రస్తావించనప్పటికీ, వారిరువురి గురించే ఆయన వ్రాసారని అందరూ అర్ధం చేసుకొన్నారు.  

ఇంతకీ ఆయన ఏమి వ్రాశారంటే, “బిజెపి ఏనాడూ తన రాజకీయ ప్రత్యర్ధులను శత్రువులుగా చూడలేదు. కేవలం రాజకీయ ప్రత్యర్ధులుగానే భావించింది. అలాగే మాతో ఏకీభవించని వారిని ‘జాతి వ్యతిరేకులు’గా భావించలేదు. పార్టీలో అంతర్గతంగా, దేశంలో కూడా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలనే కోరుకొంది. భావప్రకటనా స్వేచ్చ, భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండాలనేది మా పార్టీ సిద్దాంతం. అలాగే అవినీతిరహితంగా, పారదర్శకంగా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించాలనేది మా సిద్దాంతం. సత్యం, దేశం పట్ల నిష్ట, ప్రజాస్వామ్య పరిరక్షణ, సాంస్కృతిక జాతీయవాదం, సురాజ్య స్థాపన వంటి గొప్ప ఆశయాలను కలిగి ఉంది. ఆ విలువలను కాపాడుకోవడం కోసమే అత్యవసర సమయం (ఎమెర్జన్సీ పీరియడ్)లో బిజెపి పోరాడింది. ముందుగా నాదేశం...ఆ తరువాత నా పార్టీ.. ఆ తరువాతే నా వ్యక్తిగతం అనే నియమాన్ని అనుసరించి జీవిస్తున్నాను. ఇకపై కూడా నేను ఇదేవిధంగా జీవిస్తాను,” అని ముగించారు. 

ఇదంతా తనను ఉద్దేశ్యించి వ్రాసిందేనని ప్రధానిమోడీ గ్రహించినప్పటికీ, “బిజెపి సిద్దాంతాల గురించి అద్వానీజీ చాలా చక్కగా వివరించారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు,” అని ట్వీట్ చేశారు.   

 భారత్‌ రాజకీయాలలో అద్వానీ కురువృద్ధుడు వంటివారే. కానీ రాజకీయాల నుంచి  సగౌరవంగా తప్పుకోవలసిన 91 ఏళ్ళ వయసులో ఇంకా తనకి లేదా తన కుటుంబ సభ్యులకో లోక్‌సభ టికెట్ లభించలేదని అసంతృప్తి చెందడమే విడ్డూరంగా ఉంది. బిజెపి సిద్దాంతాల పేరిట ప్రధాని నరేంద్రమోడీని వేలెత్తి చూపుతున్న అద్వానీని బాబ్రీ మసీదు కూలద్రోయించినందుకు దేశంలోని యావత్ ముస్లింలు ఎప్పటికీ క్షమించబోరనే సంగతి ఆయనకూ తెలుసు. తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరంటే ఇదేనేమో?


Related Post