ఎన్నికల తరువాత గాంధీభవన్‌కు తాళం?

April 05, 2019


img

రాష్ట్ర విద్యాశాఖా మంత్రి జగదీష్ రెడ్డి నిన్న ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ పాలనలో ఏనాడూ తెలంగాణకు న్యాయం జరుగలేదు. అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పదేపదే తిరస్కరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయం పాలైన ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికలలో కూడా మరోసారి పరాజయం పొందడం తధ్యం. ఈ ఎన్నికలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది. లోక్‌సభ ఎన్నికల తరువాత గాంధీభవన్‌కు తాళం పడటం ఖాయం. 

తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయమని గొప్పలు చెప్పుకొంటున్న బిజెపి రాష్ట్రానికి ఏమి చేసింది? నిధులు, ప్రాజెక్టుల కోసం తెరాస ఎంపీలు, సిఎం కేసీఆర్‌ డిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేసినా ప్రధాని నరేంద్రమోడీ చెయ్యి విదిలించలేదు. కేంద్రప్రభుత్వం తెలంగాణ పట్ల ఇంత వివక్ష చూపుతున్నప్పుడు బిజెపికి ఎందుకు ఓట్లు వేయాలి? వేసినా ఏమి ప్రయోజనం? అదే... తెరాస అభ్యర్ధులను గెలిపించుకొంటే వారు రాష్ట్రం కోసం కేంద్రప్రభుత్వంతో కోట్లాడి అన్నీ సాధించుకొస్తారు.    

సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు కొత్తగా ప్రవేశపెట్టి అమలుచేస్తున్న సంక్షేమపధకాలను ఇప్పుడు కేంద్రప్రభుత్వం కూడా కాపీ కొడుతోందంటే మన పధకాలు ఎంతగొప్పవో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రంలో మైనార్టీల కోసం 5 ఏళ్ళలో 184 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రతీ వర్గం ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేకంగా పధకాలు రూపొందించి అమలుచేస్తున్నారు. సిఎం కేసీఆర్‌ నాయకత్వం కోసం యావత్ దేశమూ ఎదురుచూస్తోందిప్పుడు. లోక్‌సభ ఎన్నికల తరువాత సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో, కేంద్రప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించబోతున్నారు. కనుక 16 మంది తెరాస అభ్యర్ధులను గెలిపించుకోవలసిన అవసరం ఉంది,” అని అన్నారు. 

లోక్‌సభ ఎన్నికల తరువాత సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ఎటువంటి పాత్ర పోషిస్తారో ఇప్పుడే చెప్పలేము కానీ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ పార్టీలో మళ్ళీ లుకలుకలు మొదలవడం ఖాయం. అప్పుడు పార్టీ నుంచి మరికొందరు నేతలు తెరాస లేదా బిజెపిలో చేరిపోవడం ఖాయం. అదే జరిగితే మంత్రి జగదీష్ రెడ్డి చెప్పినట్లు గాంధీభవన్‌కు తాళం పడటం ఖాయం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయినా కనీసం కేంద్రంలో అధికారంలోకి రాగలిగితేనే రాష్ట్ర కాంగ్రెస్‌ మనుగడ సాగించగలదు లేకుంటే కష్టమే.


Related Post