కేసీఆర్‌కు జనసేనాని విజ్ఞప్తి

April 05, 2019


img

సిఎం కేసీఆర్‌కు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఒక విజ్ఞప్తి చేశారు. ఎల్బీ స్టేడియంలో గురువారం సాయంత్రం జరిగిన జనసేన బహిరంగసభలో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌గారంటే నాకెంతో గౌరవం. ఆ గౌరవంతో ఆయనకు సభాముఖంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో జోక్యం చేసుకోవద్దని కోరుతున్నాను. చంద్రబాబునాయుడుకి మీకు శతృత్వం ఉంటే అది మీరూ మీరూ చూసుకోండి. కానీ మీ ఇద్దరి గొడవలను రెండు రాష్ట్రాల గొడవలుగా చిత్రీకరిస్తూ రెండు రాష్ట్రాల ప్రజల మద్య దూరాన్ని ఇంకా పెంచవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రెండు రాష్ట్రాలకు ఏమాత్రం మంచిది కాదని మీకు కూడా తెలుసు. కనుక దయచేసి నా విజ్ఞప్తిని మన్నించి ఏపీ రాజకీయాలకు దూరంగా ఉండగలరు. అపార రాజకీయ అనుభవజ్ఞులైన మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన జగన్‌మోహన్‌రెడ్డితో చేతులు కలపడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. కేవలం చంద్రబాబునాయుడుపై ప్రతీకారం తీర్చుకోవడం కోసమే మీరు జగన్‌కు మద్దతు ఇస్తున్నారనే సంగతి అందరికీ తెలుసు. కానీ దాని కోసం మీరు ఏపి రాజకీయాలలో వేలుపెట్టాలనుకోవడం సరికాదు. జగన్‌ చెప్పులు వేసుకొని తిరుమల శ్రీవారి ఆలయంలోకి వెళ్లారు.  జగన్ యాదాద్రి ఆలయంలోకి చెప్పులతో వెళ్తే మీరు సహించగలరా? ఒకవేళ మీరు జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా ఏపీ రాజకీయాలను నియంత్రించాలని ప్రయత్నిస్తే నేను గట్టిగా వ్యతిరేకిస్తాను,” అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 

టిడిపి, జనసేన పార్టీలు తెలంగాణలో పోటీ చేసి, హైదరాబాద్‌లో బహిరంగసభలు పెట్టుకోవడానికి అభ్యంతరం లేనప్పుడు, తెరాస రాజకీయ అవసరాల కోసం ఏపీలో వైసీపీకి మద్దత్తు పలికితే తప్పని పవన్‌ కల్యాణ్‌కు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయినా తెరాస మద్దతు, సహకారాన్ని జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించబట్టే తెరాస ఏపీ రాజకీయాలలో జోక్యం చేసుకోగలుగుతోంది తప్ప దానంతట అది ఏపీలో పోటీ చేయడం లేదు కదా? తెరాసకు దమ్ముంటే ఏపీలో నేరుగా పోటీ చేయాలని పవన్‌ కల్యాణ్‌ స్వయంగా సవాలు విసిరిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏపీ రాజకీయాలలో వేలు పెట్టవద్దని పవన్‌ కల్యాణ్‌ చెపుతున్న మాటలు చంద్రబాబునాయుడు మనసులో మాటల్లా ఉన్నాయి. ఆయన కోరుకొంటున్నదే పవన్‌ కల్యాణ్‌ నోటి ద్వారా చెపుతున్నట్లుంది. 


Related Post