నిజామాబాద్‌ రైతులకు న్యాయం జరుగుతుందా?

April 04, 2019


img

ఈరోజుల్లో కేవలం కోటీశ్వరులు, బడా పారిశ్రామికవేత్తలు లేదా అంగబలం, అర్ధబలం, పార్టీలో పరపతి ఉన్నవారు మాత్రమే ఎన్నికలలో పోటీ చేయాలి తప్ప సామాన్యులెవరూ పోటీ చేయడానికి వీలులేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా నామినేషన్ వేసినా అటువంటి వారిని ప్రజలే పట్టించుకోరు. ఇక ప్రభుత్వం, ఎన్నికల సంఘం, న్యాయస్థానాలు పట్టించుకొంటాయనుకోవడం అత్యాశే అవుతుంది. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి నామినేషన్లు వేసిన 176 మంది రైతుల పరిస్థితి ప్రస్తుతం అదే. 

కారణాలు ఏవైతేనేమీ వారు నియమనిబందనల ప్రకారం నామినేషన్లు వేశారు. వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. కానీ ఎన్నికల ప్రచారం ముగియడానికి ఇంకా 5 రోజులు మాత్రమే గడువు మిగిలున్నప్పటికీ ఇంతవరకు వారెవరికీ ఎన్నికల గుర్తులు కేటాయించకపోవడాన్ని ఏమనుకోవాలి? ఇదే ప్రశ్నిస్తూ వారు గురువారం హైకోర్టులో పిటిషన్ వేస్తే వారు తమ నామినేషన్ పత్రాలను కోర్టుకు సమర్పిస్తే కానీ కేసుపై విచారణ చేపట్టలేమని చెపుతూ కేసును సోమవారానికి వాయిదా వేసింది. రైతుల తరపున వాదించిన రచనా రెడ్డి అభ్యర్ధన మేరకే వారు తమ నామినేషన్ పత్రాలు సమర్పించడానికి కోర్టు సోమవారం వరకు గడువు ఇచ్చినప్పటికీ, అప్పటికి ప్రచారం చేసుకోవడానికి ఒకే ఒక రోజు గడువు మిగిలి ఉంటుంది. 

ఒకవేళ రైతుల తరపు న్యాయవాది వాదనలతో హైకోర్టు ఏకీభవించి ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తే పరువలేదు కానీ ఎన్నికల సంఘం పరిధిలో ఉన్న ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని చెపితే నామినేషన్లు వేసిన రైతులకు అన్యాయం జరిగినట్లవుతుంది. 

ఎన్నికల సంఘం రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పనిచేయవలసిన స్వతంత్ర సంస్థ. కానీ ప్రధాన రాజకీయ పార్టీలకు, వాటి అభ్యర్ధులకే ప్రాధాన్యత ఇస్తూ, నామినేషన్లు వేసిన నిజామాబాద్‌ రైతులకు ఇంతవరకు ఎన్నికల గుర్తులు కేటాయించకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోకుండా వ్యవహరిస్తుండటం శోచనీయం. నిజామాబాద్‌ రైతులు చాలా ధైర్యంగా, సంఘటితంగా నామినేషన్లు వేసినప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో వారికి న్యాయం జరుగుతుందో లేదో అనుమానమే! 


Related Post