తెలంగాణలో బిజెపి 3 సీట్లు కూడా గెలుచుకోలేదా?

April 04, 2019


img

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెరాస నేతలు దూకుడు పెంచుతున్నారు. సిఎం కేసీఆర్‌ ఏకంగా ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుండగా ఆయన కుమారుడు కేటీఆర్‌ కూడా తండ్రిబాటలోనే ముందుకు సాగుతూ బిజెపి నేతలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

ఈరోజు ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌, రాష్ట్ర బిజెపి నేతలకు కనీసం మూడు లోక్‌సభ సీట్లు గెలుచుకొని చూపించాలని సవాలు విసిరారు. అసెంబ్లీ ఎన్నికలలో 117 స్థానాలకు పోటీ చేసి 103 స్థానాలలో డిపాజిట్లు కోల్పోయి, చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఒకే ఒక సీటు గెలుచుకొన్న బిజెపికి ఈసారి ఒక్క సీటు కూడా రాదని, బిజెపి అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోకుండా ఉంటే అదే గొప్ప విషయం అవుతుందని అన్నారు. రెండు సీట్లతో తెలంగాణ సాధించి చూపిన కేసీఆర్‌, 16 ఎంపీ సీట్లతో ఏమి సాధిస్తారో చేసి చూపిస్తారని అన్నారు. రాజకీయాలలో మందబలం కాదు బలమైన ముద్రవేసే నాయకుడు అవసరమని కేటీఆర్‌ అన్నారు.  

“ఈసారి లోక్‌సభ ఎన్నికలలో బిజెపి సొంతంగా 300 సీట్లు గెలుచుకొంటుందని లేకుంటే కేసీఆర్‌, కేటీఆర్‌ రాజకీయ సన్యాసం చేస్తారా?” అని బండారు దత్తాత్రేయ సవాలుకు కేటీఆర్‌ ఈవిధంగా ప్రతిసవాలు విసిరి రాష్ట్ర బిజెపి నేతలకు నోటమాట రాకుండా చేశారు. 

గ్రేటర్ ఎన్నికల నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఎన్నికలలో బిజెపి ఓడిపోతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు కానీ 117 స్థానాలకు పోటీ చేస్తే 116 స్థానాలలో ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. కనీసం సిట్టింగ్ స్థానాలనైనా నిలబెట్టుకొంటుందని అందరూ భావించారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో 3 సీట్లు గెలిచి చూపించాలని కేటీఆర్‌ సవాలు విసురుతున్నారంటే రాష్ట్రంలో బిజెపి పరిస్థితి ఏమిటో అర్ధం అవుతుంది.


Related Post