అవును సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతూనే ఉన్నాయి!

April 06, 2019


img

ప్రస్తుతం ‘సర్జికల్ స్ట్రైక్స్’ అనే పదం రాజకీయాలలో బాగా వినిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలలో లబ్ది పొందాలని బిజెపి దానిని ఉపయోగించుకొంటుంటే, రాజకీయ అవసరాల కోసం దేశభద్రతతో మోడీ సర్కార్ చెలగాటమాడిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ కూడా భారత్‌లో పార్లమెంటు ఎన్నికల కోసమే మోడీ ప్రభుత్వం తమ దేశంపై సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని ఆరోపిస్తున్నారు. 

నోట్లరద్దు, జిఎస్టిలతో మోడీ సర్కార్ దేశంలో ప్రజలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని కానీ తాను అధికారంలోకి వస్తే దేశంలో పేదరికంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తానని రాహుల్ గాంధీ చెపుతున్నారు. 

మోడీ సర్కార్ గొప్పగా చెప్పుకొంటున్న చేసిన సర్జికల్ స్ట్రైక్స్ లో ఒక్క చీమ కూడా చావలేదని కేసీఆర్‌ ఎద్దేవా చేస్తున్నారు. మోడీ సర్కార్ ఒక్కసారి సర్జికల్ స్ట్రైక్స్ చేసి గొప్పలు చెప్పుకొంటోందని కానీ యూపీయే హయాంలో 11 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని కేసీఆర్‌ కొత్తవిషయం బయటపెట్టారు. లోక్‌సభ ఎన్నికల తరువాత తాను డిల్లీ వెళ్ళి కాంగ్రెస్‌, బిజెపిలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఆ రెండు పార్టీల చెర నుంచి దేశాన్ని విడిపిస్తానని సిఎం కేసీఆర్‌ హామీ ఇస్తున్నారు. 

కానీ అత్యంత ప్రభావంతమైన సర్జికల్ స్ట్రైక్స్ కేసీఆర్‌ మాత్రమే చేశారని చెప్పవచ్చు. కేవలం 15 రోజుల వ్యవదిలో ఏకంగా 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలోకి ఫిరాయింపజేసి లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆ పార్టీని కోలుకోలేనివిధంగా దెబ్బ తీశారు.

తెరాస, బిజెపిలు రహస్య అవగాహన కుదుర్చుకొని తమ పార్టీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మజ్లీస్ పార్టీ కూడా ఎప్పుడైనా తెరాసపై సర్జికల్ స్ట్రైక్స్ చేసే అవకాశం ఉందని ‘సర్జికల్ స్ట్రైక్స్ ఎక్స్‌పర్ట్’ మన ప్రధాని నరేంద్రమోడీ అనుమానం వ్యక్తం చేశారు. 

సీనియర్ కాంగ్రెస్‌ నేతలు డికె అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, తెరాస ఎంపీ జితేందర్ రెడ్డిలను వారి పార్టీలలో ఎవరికీ తెలియకుండా హటాత్తుగా బిజెపిలో చేర్చుకొని ఆ రెండు పార్టీలపై బిజెపి సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. లోక్‌సభ ఎన్నికల తరువాత తెరాసపై తీవ్రస్థాయిలో సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ప్రకటించారు.     

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధులను గెలిపిస్తే ఎన్నికల తరువాత వారందరూ తెరాసలో చేరిపోవడం ఖాయమని కనుక బిజెపి అభ్యర్ధులకే ఓట్లు వేయాలని ఆ పార్టీ సీనియర్ నేత కిషన్‌రెడ్డి ప్రజలకు చేస్తున్నారు. ఎన్నికల తరువాత కేసీఆర్‌ మళ్ళీ కాంగ్రెస్ పార్టీపై సర్జికల్ స్ట్రైక్స్ చేయక మునుపే పార్టీని తెరాసలో విలీనం చేసేసి లేదా మూసేసి ఆ ప్రమాదం నుంచి బయటపడాలని కిషన్‌రెడ్డి ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు.  

కనుక లోక్‌సభ ఎన్నికల తరువాత కూడా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతూనే ఉంటాయని భావించవచ్చు. 



Related Post