స్టీరింగ్ ఒకటే కాదు...ఇంకా చాలా ఉన్నాయి: ఓవైసీ

April 03, 2019


img

ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నప్పుడు ‘తెరాస కారు స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉందని.. ఏదో ఓ రోజు మజ్లీస్ కారు టైరును పంక్చర్ చేయడం ఖాయమని’ ఎద్దేవా చేశారు. దానిపై తెరాస ఇంకా స్పందించలేదు కానీ మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. 

మంగళవారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, “తెరాస కారు స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉంటే నరేంద్రమోడీకి ఎందుకు? తెరాస కారు స్టీరింగే కాదు... తెరాస కారుకు బ్యాటరీ, ఇంజన్ కూడా మజ్లీస్ పార్టీయే. బిజెపి బ్యాటరీ వీక్ అయిపోతోంది కనుకనే నరేంద్రమోడీ కంగారు పడుతున్నారు. అయితే ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడవలసిన మాటలు కావివి,” అన్నారు. 

తెరాస కారు స్టీరింగ్ కేసీఆర్‌ చేతిలో ఉన్న సంగతి అందరికీ తెలుసు. అయితే డ్రైవింగ్ సాఫీగా సాగడానికి మజ్లీస్ సహకారం కూడా తీసుకొంటాని కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. అంతవరకే అయితే పరువాలేదు. కానీ అవకాశం వస్తే మజ్లీస్ పార్టీయే డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ తిప్పాలని కోరుకొంటోందని అసెంబ్లీ ఎన్నికల సమయంలో మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పిన మాట మరిచిపోలేము. అసెంబ్లీ ఎన్నికలలో తెరాసకు పూర్తి మెజారిటీ రాదని, అప్పుడు మజ్లీస్ పార్టీపై ఆధారపడకతప్పదని, అప్పుడు మజ్లీస్ నేతే తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనక్కరలేదని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. తెలంగాణలో ఎవరు అధికారంలో ఉన్న మజ్లీస్ ముందు చేతులు కట్టుకొని జీ హుజూర్ అంటూ నిలబడవలసిందే...ప్రభుత్వ పగ్గాలు ఎప్పుడూ తమ చేతుల్లోనే ఉంటాయని అన్నారు. 

కానీ తెరాస పూర్తి మెజార్టీతో  అధికారంలోకి రావడంతో మజ్లీస్ గొంతు మెత్తబడింది.. మళ్ళీ ‘తెరాస హమారా జిగిరీ దోస్త్’ అంటూ పాత పాట పాడుతూ కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేస్తోంది. మజ్లీస్ అంతరంగం కేసీఆర్‌ గ్రహించినప్పటికీ, రాజకీయ అవసరాల దృష్ట్యా మజ్లీస్ పార్టీతో దోస్తీ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఓవైసీ సోదరులు గులాబీ కారులో ప్రస్తుతం వెనుక సీటుకే పరిమితం అయినప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్లు అవకాశం చిక్కితే వారిరువురూ గులాబీ కారు టైరు పంక్చర్ చేయడానికి వెనుకాడకపోవచ్చు.


Related Post