మైనార్టీ ఓట్ల కోసమే విమర్శలు: కిషన్‌రెడ్డి

April 03, 2019


img

తెరాస ఎన్నికల ప్రచార సభలలో సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలకు సికిందరాబాద్‌ బిజెపి అభ్యర్ధి కిషన్‌రెడ్డి ఘాటుగా జవాబిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ చాలా అభివృద్ధి జరిగిపోయింది. దేశానికే ఆదర్శం అని కేసీఆర్‌, కేటీఆర్‌ గొప్పలు చెప్పుకొంటున్నారు. అయితే ఆయన చెపుతున్న అభివృద్ధి కేవలం గ్రాఫిక్స్ లో మాత్రమే కనిపిస్తుంది తప్ప క్షేత్రస్థాయిలో కనిపించదు. కేసీఆర్‌ 5 ఏళ్ళ పాలన తరువాత కూడా రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తికాలేదు. కనీసం లక్ష ఉద్యోగాలు కల్పించలేకపోయారు. రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధరల కోసం రోడ్లేక్కి ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలలో తీవ్ర అశాంతి, ఆగ్రహం నెలకొని ఉన్నాయి.    

మైనార్టీల ఓట్లు సంపాదించుకోవడం కోసమే కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. పాతబస్తీకి మెట్రో వేయకుండా మజ్లీస్ పార్టీ అడ్డుపడుతుంటే కేసీఆర్‌ దానికి ఎందుకు వంతపాడుతున్నారంటే మైనార్టీ ఓట్ల కోసమే. తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో సహకరించిన ప్రధాని నరేంద్రమోడీపై కేసీఆర్‌ విమర్శలు చేస్తూ, అభివృద్ధికి స్పీడ్ బ్రేకరుగా మారిన మజ్లీస్ పార్టీతో దోస్తీ చేస్తున్నారు. 

16 ఎంపీ సీట్లతో కేసీఆర్‌ ప్రధానమంత్రి అయిపోవాలని ఏవిధంగా కలలు కంటున్నారో తెలియదు కాని మళ్ళీ నరేంద్రమోడీయే ప్రధాని కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకొంటున్నారు. లోక్‌సభ ఎన్నికలలో బిజెపి 300 సీట్లు గెలుచుకొని కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తద్యం. ప్రజలు కోరుకొంటున్నట్లుగా నరేంద్రమోడీ మళ్ళీ ప్రధాని కావడం ఖాయం. కనుక ప్రధానిని ఎన్నుకోవడానికి జరుగుతున్న ఈ లోక్‌సభ ఎన్నికలలో తెరాసకు ఓటు వేసినా ప్రయోజనం ఉండదు. నరేంద్రమోడీ ప్రధాని కావాలంటే రాష్ట్ర ప్రజలందరూ బిజెపి అభ్యర్ధులకే ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి,” అని కిషన్‌రెడ్డి అన్నారు. 


Related Post