కాబోయే తెలంగాణ సిఎం ఆయనే: మహమూద్ ఆలీ

April 03, 2019


img

రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “లోక్‌సభ ఎన్నికల తరువాత కేసీఆర్‌ దేశ ప్రధానిగా, కేటీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి. ఇటీవల కశ్మీర్‌కు చెందిన కొందరు నేతలు నన్ను కలిసినప్పుడు కేసీఆర్‌ ప్రధానమంత్రి అయితే కశ్మీర్‌ సమస్య పరిష్కరించగలరనే నమ్మకం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ, లోక్‌సభ ఎన్నికల తరువాత  కేంద్రప్రభుత్వం ఏర్పాటులో కేసీఆర్‌ కీలకపాత్ర పోషించబోతున్నారని ఖచ్చితంగా చెప్పగలను,” అని అన్నారు. 

కేసీఆర్‌ ప్రధానమంత్రి అయితే తెరాస నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదు...తెలుగు ప్రజలందరూ చాలా సంతోషిస్తారు. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపి, ప్రాంతీయ పార్టీలు ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకొంటాయనేది ముఖ్యం. ఆ తరువాత ప్రాంతీయ పార్టీల రాజకీయ అవసరాలు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిపదవుల పంపకాలు వగైరా లెక్కల ఆధారంగా జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు మారుతాయి. ఆ మార్పులను బట్టే కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి వస్తుంది? ఎవరు ప్రధానమంత్రి అవుతారనేది తెలుస్తుంది తప్ప రాజకీయ పార్టీలకు అనుకూలంగానో వ్యతిరేకించే సంస్థలు వెలువరించే సర్వే నివేదికల ఆధారంగా కాదనే సంగతి అందరికీ తెలుసు. 

ఏది ఏమైనప్పటికీ, కేసీఆర్‌ ప్రధానమంత్రి అయినా కాకపోయినా మహమూద్‌ అలీ చెపుతున్నట్లు కేంద్రప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. ఒకవేళ బిజెపి లేదా కాంగ్రెస్ పార్టీలలో ఏదో ఒకటి పూర్తి మెజారిటీతో కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే అప్పుడు కేంద్రంలో కేసీఆర్‌ పాత్ర పరిమితంగానే ఉండవచ్చు. అప్పుడు కేసీఆర్ జాతీయపార్టీ ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టవచ్చు. ఒకవేళ మళ్ళీ నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయితే ఎన్డీయే కూటమిలో చేరి విద్యుత్ లేదా జలవనరులు లేదా సంక్షేమ శాఖలలో ఏదో ఒక మంత్రి పదవి కోరి తీసుకోవచ్చు. 

కేటీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వాలంటే కేసీఆర్‌ తప్పనిసరిగా జాతీయ రాజకీయాలకు షిఫ్ట్ అవ్వాలి కనుక మహమూద్ అలీ చెపుతున్నట్లు కేసీఆర్‌ ప్రధానమంత్రి అయినా కాకపోయినా లోక్‌సభ ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాలలోకి షిఫ్ట్ అవడం తధ్యమనే భావించవచ్చు.


Related Post