కాంగ్రెస్‌ను తెరాసలో విలీనం చేయాలి: కిషన్‌రెడ్డి

April 03, 2019


img

సికిందరాబాద్‌ బిజెపి లోక్‌సభ అభ్యర్ధి కిషన్‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఉద్దేశ్యించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఎంపీలు గెలిచినా వారు కూడా తెరాసలో చేరిపోవడం ఖాయం. కనుక కాంగ్రెస్ పార్టీని తెరాసలో విలీనం చేయడమో లేదా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రద్దు చేయడమో చేస్తే మంచిది. కాంగ్రెస్‌ ఎంపీలు గెలిచినా దేశానికి రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడరు. ఈ ఎన్నికలు ప్రధానమంత్రిని ఎన్నుకొనేందుకు జరుగుతున్నవి కనుక తెరాస ఎంపీలు గెలిచినా, ఓడినా తేడా ఉండదు. కనుక దేశాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తున్న నరేంద్రమోడీని మళ్ళీ ప్రధానమంత్రిగా ఎన్నుకొనేందుకు రాష్ట్ర ప్రజలు బిజెపి అభ్యర్ధులకే ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాను. 

అసెంబ్లీ ఎన్నికల తరువాత 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలోకి ఫిరాయించిన నేపధ్యంలో ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధులు గెలిచినా వారు కూడా తెరాసలో చేరిపోవచ్చునని కిషన్‌రెడ్డి చెప్పిన మాట వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. ఒకవేళ ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధులు గెలిచి తెరాసలో చేరిపోయినా లేదా ఓడిపోయినా లేదా అందరూ ఓడిపోయినా అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మిగిలిన కొద్దిమంది సీనియర్ నేతలు రాజకీయ సన్యాసం తీసుకోకతప్పదేమో? అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా మిగిలిపోయినా ఆశ్చర్యం లేదు. లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు కానీ ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. 


Related Post