నాకు ఆ ఆశ లేదు: కేసీఆర్‌

April 02, 2019


img

మంగళవారం వరంగల్‌లో జరిగిన తెరాస ఎన్నికల ప్రచారసభలో సిఎం కేసీఆర్‌ మరో కొత్త విషయం చెప్పారు. తనకు ప్రధానమంత్రి కావాలనే కోరిక ఏమాత్రం లేదని, ఎన్నికలలో ప్రజాభీష్టం గెలవలనేదే తన అభిమతమని అన్నారు. కాంగ్రెస్‌, బిజెపిలలో ఏది కేంద్రంలో అధికారంలో వచ్చినప్పటికీ రాష్ట్రాలపై కర్రపెత్తనం చేస్తూ ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని కనుక కేంద్రంలో ప్రాంతీయపార్టీలతో కూడిన ఫెడరల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి రావలని కోరుకొంటున్నానని కేసీఆర్‌ అన్నారు. అప్పుడే రాష్ట్రాలకు న్యాయంగా దక్కవలసినవన్నీ దక్కుతాయని కేసీఆర్‌ అన్నారు. 

కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు అదనంగా ఏమీ ఇవ్వకపోగా, రాష్ట్రాలు చేసే ప్రతిపాదనలను కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. వర్గీకరణ, రిజర్వేషన్లు వంటి ప్రతిపాదనలపై కేంద్రం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏదో ఉదారంగా రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నట్లు వ్యవహరిస్తోందని కానీ నిజానికి రాష్ట్రాలే కేంద్రప్రభుత్వాన్ని పోషిస్తున్నాయని కేసీఆర్‌ అన్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ ఒక సర్పంచ్ కంటే హీనంగా మాట్లాడుతున్నారని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్‌ అన్నారు. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్నామని చెప్పారు. కనుక రైతులెవరూ అధికారులకు లంచాలు ఇవ్వవద్దని కేసీఆర్‌ కోరారు. లోక్‌సభ ఎన్నికల తరువాత భూసమస్యలకు శాశ్విత పరిష్కారం చేస్తానని కేసీఆర్‌ చెప్పారు. 

తెరాస నేతలు మొదట్లో దేశరాజకీయాలలో గుణాత్మకమైన మార్పు కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అవసరమని చెప్పుకొచ్చారు. ఆ తరువాత మెల్లగా దేశానికి కేసీఆర్‌ నాయకత్వం అవసరమని చెప్పడం మొదలుపెట్టారు. చివరికి కేసీఆర్‌ ప్రధానమంత్రి కావలసిన అవసరం ఎంతైనా ఉందని అసలు విషయం బయటపెట్టారు. కానీ కేవలం 16 ఎంపీ సీట్లతో కేసీఆర్‌ ఏవిధంగా డిల్లీలో చక్రం తిప్పగలరు? ఏవిధంగా ప్రధానమంత్రి కాగలరనే ప్రతిపక్షాలు ప్రశ్నలకు తెరాస నేతలు సంతృప్తికరమైన జవాబులు చెప్పలేకపోతున్నారు. బహుశః అందుకే కేసీఆర్‌ తనకు ప్రధానమంత్రి పదవిపై ఆశలేదని చెప్పి ఉండవచ్చు. కానీ కేసీఆర్‌ ఒకసారి ఏదైనా లక్ష్యం నిర్ణయించుకొంటే అది సాధించేవరకు విడిచిపెట్టరని అందరికీ తెలుసు. కనుక కేసీఆర్‌ తాత్కాలికంగా వెనక్కు తగ్గినా తన లక్ష్యం వైపే అడుగులు వేస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చు.


Related Post