కొండా తప్పులు అప్పుడు కనబడలేదా?

April 02, 2019


img

సాధారణంగా పార్టీలు వీడే నేతలు వారి పాత పార్టీలపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుంటారు. అప్పుడు ఆ పార్టీలు కూడా వారి చరిత్రను బయటపెడుతుంటాయి. ఇది రాజకీయాలలో సహజమే. కానీ ఇప్పుడు రాజకీయపార్టీలకు-మీడియాకు మద్య అడ్డుగీత చెరిగిపోవడంతో మీడియా కూడా రాజకీయపార్టీల మాదిరిగానే ఏదో ఒక పార్టీని వెనకేసుకొని దాని ప్రత్యర్ధులను తన ప్రత్యర్ధులుగా భావిస్తూ కధనాలు ప్రచురిస్తున్నాయి. 

చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మారిన తరువాత మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన గురించి తెరాస అనుకూల మీడియాలో ఈరోజు ఒక ఆసక్తికరమైన కధనం ప్రచురించబడింది. “గత ఐదేళ్ళలో ఆయన ఏనాడూ కార్యకర్తలకు సమయం కేటాయించలేదు. నియోజకవర్గం ప్రజలను దగ్గరకు రానీయలేదు. ఆయనను కలుసుకోవాలంటే అదో పెద్ద తంతు. ఆయన దర్శన భాగ్యం కలగాలంటే చాలా మెట్లు ఎక్కాలనే విమర్శలున్నాయని” ఆ పత్రిక పేర్కొంది. అటువంటి వ్యక్తి తనను మళ్ళీ గెలిపించాలంటూ ప్రచారం చేసుకొంటున్నారని సదరు పత్రిక ఆక్షేపించింది. ప్రజలతో, సొంత పార్టీ కార్యకర్తలతో సరైన సంబందాలు లేని కారణంగా నియోజకవర్గంలో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డాక్టర్ రంజిత్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని తెరాస వర్గాలు మండిపడుతున్నాయంటూ సదరు మీడియా వ్రాసింది. 

ఇదే విషయం ఆయన తెరాస ఎంపీగా ఉన్నప్పుడే ఆ పత్రిక బయటపెట్టి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు. పార్టీలో ఉన్నవారందరూ మంచివారు, చిత్తశుద్ధితో పనిచేసేవారు..కానీ పార్టీని వీడితే అదే వ్యక్తులు అకస్మాత్తుగా చెడ్డవారు...చిత్తశుద్దిలేనివారని నిందించడం హాస్యాస్పదంగా ఉంది. రాజకీయ పార్టీలు వాటి నేతలు నిందించుకోవడం సహజమే కానీ మీడియా కూడా ఒక రాజకీయపార్టీలాగ వ్యవహరిస్తుండటమే విస్మయం కలిగిస్తుంది. 



Related Post