పార్లమెంటులో నిర్భయంగా మాట్లాడగలిగేవారెవరు?

April 02, 2019


img

సాధారణంగా ఎంపీల పనితీరు వారి పార్టీల విధానాలు, వాటి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ కేంద్రంలో మళ్ళీ బిజెపి లేదా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే, ఆ పార్టీల ఎంపీలు తమ తమ రాష్ట్రాల సమస్యల గురించి పార్లమెంటులో గట్టిగా మాట్లాడగలరా అంటే అనుమానమే.  ఎందుకంటే గట్టిగా మాట్లాడితే వారి పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. కనుక ఎంపీలు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతారు లేదా పార్టీకి ఇబ్బందికలిగించని అంశాల గురించి మాత్రమే పార్లమెంటులో మాట్లాడగలుగుతారు. 

కాంగ్రెస్‌, బిజెపిలకు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కంటే పార్లమెంటులో తమ ప్రత్యర్ధిపై ఏవిధంగా పైచేయి సాధించాలనే ఆలోచిస్తుంటాయి. అధికారంలో ఉన్న పార్టీ ఎంపీలైతే ప్రధానమంత్రి లేదా కేంద్రమంత్రులు చెపుతున్న మాటలకు బల్లలు చరుస్తూ తాళం వేయడానికి పరిమితం అవుతారు. అదే ప్రతిపక్ష ఎంపీలైతే పార్లమెంటులో ఆందోళన చేస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేయడానికే ప్రయత్నిస్తుంటారు. ఇవన్నీ దేశప్రజలందరూ నిత్యం కళ్ళారా చూస్తూనే ఉన్నారు. కనుక పార్లమెంటులో రాష్ట్ర సమస్యల గురించి, రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి గట్టిగా నిర్భయంగా కేంద్రాన్ని నిలదీసి అడగగలిగేవారినే ప్రజలు ఎన్నుకోవలసిన అవసరం ఉంది.

తెరాస విషయానికి వస్తే అది 16 ఎంపీ సీట్లు గెలుచుకొంటే డిల్లీలో చక్రం తిప్పగలదా లేదా అనే విషయం పక్కన బెడితే, ఇదివరకులాగే వారు రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా కొట్లాడుతారని చెప్పవచ్చు. అయితే వారు కూడా తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలకు, వివిద అంశాలపై తమ పార్టీ విధానాలకు అనుగుణంగానే పార్లమెంటులో వ్యవహరిస్తున్నప్పటికీ కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలతో పోలిస్తే వారు రాష్ట్రం తరపున పార్లమెంటులో నిర్భయంగా మాట్లాడగలరని ఇప్పటికే నిరూపించుకొన్నారు. కనుక ఈ విషయంలో తెరాస వాదనతో ఏకీభవించవచ్చు. 


Related Post