తెరాస ధీమాకు కారణం ఏమిటో?

April 02, 2019


img

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దేశంలో కాంగ్రెస్, బిజెపిలు ఒంటరిగా పోటీ చేసి గెలవలేని దుస్థితిలో ఉన్నాయి. తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలలో అవి చాలా బలహీనపడ్డాయి. ఈసారి బిజెపికి 160-170, కాంగ్రెస్ పార్టీకి 100 లోపు సీట్లు రావచ్చునని సర్వేలు చెపుతున్నాయి. కనుక తెరాస 16 ఎంపీ సీట్లు గెలుచుకొన్నట్లయితే జాతీయ రాజకీయాలలో క్రియాశీలమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. డిల్లీలో తెలంగాణకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రానికి రావలసినవన్నీ సాధించుకోవచ్చు. అదే కాంగ్రెస్‌ లేదా బిజెపిలు అధికారంలోకి వస్తే తెలంగాణకు అవేమీ చేయవు. కానీ తెరాస ఎంపీలు గెలిస్తే తెలంగాణకు రావలసినవన్నీ సాధించుకొనే వరకు పోరాడుతోనే ఉంటారు,” అని అన్నారు.  

రాష్ట్రంలో తెరాస అభ్యర్ధులు భారీ మెజార్టీతో గెలవాలని కోరుకోవడం సహజమే కానీ కాంగ్రెస్‌, బిజెపిలు చెరో 100-170 సీట్లు గెలుచుకోబోతున్నాయని కేటీఆర్‌ స్వయంగా చెపుతున్నప్పుడు, అవి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కేవలం 16 సీట్లు గెలుచుకోబోయే తెరాస డిల్లీలో చక్రం తిప్పబోతోందని చెప్పడమే చాలా విచిత్రంగా ఉంది. ఇప్పటి వరకు ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఎన్ని పార్టీలు కలిసి పనిచేస్తాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఎంతమంది కేసీఆర్‌ నాయకత్వాన్ని అంగీకరిస్తారో తెలియదు. తెలంగాణ ప్రజలు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు కేసీఆర్‌ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు కనుక యావత్ దేశ ప్రజలు, పార్టీలు, వాటి నేతలు కూడా అంగీకరిస్తానుకోలేము. 

అయితే తెరాస ధీమాకు ఏదో బలమైన కారణం ఉండే ఉండాలి లేదా కేవలం 16 ఎంపీ సీట్లను గెలుచుకోవడం కోసమే ఈ ‘చక్రం తిప్పుడు’ స్టోరీ చెపుతున్నట్లు భావించాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఎలాగూ తెరాస వాదనలలో నిజానిజాలు బయటపడతాయి. కనుక అంతవరకు వేచి చూడాల్సిందే.


Related Post