కలలను సాకారం చేసుకొనేదెవరో...త్యాగం చేసేదెవరో ?

April 02, 2019


img

యూపీలోని బీఎస్పీతో ఏపీలోని జనసేన పార్టీ ఎన్నికల పొత్తులు పెట్టుకొని ఆ పార్టీకి సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. కనుక ఆ పార్టీ అధినేత్రి  మాయావతి మంగళవారం విశాఖపట్నంలో జనసేన తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి వస్తున్నారు. జనసేన అభ్యర్ధులు సికిందరాబాద్‌, మల్కాజ్‌గిరి, మహబూబాబాద్ నియోజకవర్గాల నుంచి కూడా లోక్‌సభకు పోటీ చేస్తున్నందున, వారికి మద్దతుగా ఈనెల 4వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పవన్‌ కల్యాణ్‌, మాయావతి బహిరంగసభ నిర్వహించనున్నారు. 

ఇక్కడవరకు పిక్చర్ క్లియర్ గానే ఉంది కానీ లోక్‌సభ ఎన్నికల తరువాత మాయావతి ఎవరితో కలిసి పనిచేయబోతున్నారనే ప్రశ్నకు సమాధానం లేదు.   

ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే యూపీలో ఎస్పీ, బీఎస్పీలు ఈసారి ఎన్నికల పొత్తులుపెట్టుకొని దానినే దూరంగా ఉంచాయి. కానీ కాంగ్రెస్‌ పార్టీతో తమకు ఎటువంటి శత్రుత్వం లేదని ముందే స్పష్టం చేశాయి. ప్రధానమంత్రి రేసులో ఉన్నవారిలో మాయావతి కూడా ఒకరు. అలాగే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రధాని రేసులో ఉన్నారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అలాగే కెసిఆర్ కూడా ఆ రేసులో చేరినట్లు స్పష్టం అయ్యింది కనుక ప్రస్తుతం ప్రతిపక్షాలలో ప్రధానమంత్రి పదవికి రాహుల్ గాంధీతో కలిపి నలుగురు పోటీ పడుతున్నారు.

లోక్‌సభ ఎన్నికల తరువాత ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఫెడరల్‌ ఫ్రంట్‌తో కలిసి పనిచేస్తాయని సిఎం కేసీఆర్‌ చెపుతున్నారు. ఆ మూడు పార్టీలు కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమిలో ఉంటాయని ఏపీ సిఎం చంద్రబాబునాయుడు చెప్పుతున్నారు. కానీ ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేనప్పుడు నాలుగు కత్తులు అసలే ఇమడవు కనుక ఆ నలుగురు ఒకే గొడుగు క్రింద ఉండలేరు. ఉండాలనుకొంటే మిగిలినవారు తమ ‘కలలను’ త్యాగాలు చేయకతప్పదు. కనుక ఎవరు ఎటువైపు ఉంటారు? ఎవరు త్యాగాలు చేస్తారనే ప్రశ్నకు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతే తెలుస్తుంది. 


Related Post