నిజామాబాద్‌ ఎన్నికల నిర్వహణలో మళ్ళీ ట్విస్ట్

April 01, 2019


img

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పసుపు, ఎర్రజొన్న రైతులతో కలిపి మొత్తం 185 మంది అభ్యర్ధులు బరిలో నిలవడంతో, బ్యాలెట్ పత్రాలతో పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్‌ చెప్పారు. కానీ ఆ తరువాత కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలతోనే పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించి, అందుకు అవసరమైన ఈవీఎం, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్ మెషిన్లను సరఫరా చేయబోతున్నట్లు ఈరోజు ఉదయం వార్తలు వచ్చాయి. వాటిని చూసి నామినేషన్లు వేసిన పసుపు రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలే కాక చివరికి ఎన్నికల సంఘం కూడా తమను మోసం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో వస్తున్న ఈ వార్తలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్‌ స్పందించారు. 

నిజామాబాద్‌ నియోజకవర్గంలో ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహణ సాధ్యపడదని, కనుక బ్యాలెట్ పేపర్లతోనే పోలింగ్ నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు. కేవలం 63 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నట్లయితే ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహించవచ్చునని అంతకు మించి ఉన్నట్లయితే బ్యాలెట్ పత్రాలు ముద్రించక తప్పదని రజత్ కుమార్‌ చెప్పారు. నిజామాబాద్‌లో 185 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు కనుక తప్పనిసరిగా బ్యాలెట్ పేపర్లతోనే పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. రిటర్నింగ్ అధికారి నుంచి ఫారం-7 ఏ అండగానే బ్యాలెట్ పత్రాలు ముద్రిస్తామని రజత్ కుమార్‌ తెలిపారు. కనుక నిజామాబాద్‌ రైతులు కోరుకొన్నట్లుగానే బ్యాలెట్ పత్రాలతోనే పోలింగ్ జరుగబోతోంది. 


Related Post