కేరళ నుంచి రాహుల్ పోటీ!

April 01, 2019


img

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి యూపీలోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గం నుంచి కూడా లోక్‌సభకుపోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఆంటోనీ ప్రకటించారు. మోడీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై, బాషా సంస్కృతులపై దాడి చేస్తున్న కారణంగానే రాహుల్ గాంధీ ఈసారి దక్షిణాది రాష్ట్రం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకొన్నారని ఆంటోనీ తెలిపారు. 

కానీ దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా పట్టుకోల్పోతున్నందునే అక్కడ పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపి మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకొనేందుకే రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీ చేస్తున్నారని చెప్పవచ్చు. కేరళలోని వయనాడ్‌ను ఎంచుకోవడానికి కూడా బలమైన కారణమే ఉంది. ఆ నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ షానవాజ్ గత ఏడాది నవంబరులో చనిపోయారు. ఆ నియోజకవర్గంపై కాంగ్రెస్‌ పార్టీకి మంచి పట్టుంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులలో ఈ వయనాడ్‌ నియోజకవర్గం ఉంది. కనుక ఇక్కడ నుంచి పోటీ చేసినట్లయితే ఆ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ శ్రేణులలో ఉత్సాహం నింపి, సత్ఫలితాలు రాబట్టవచ్చునని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకే రాహుల్ గాంధీ వయనాడ్‌ నుంచి పోటీ చేయడానికి సిద్దపడుతున్నారు. 

ఒకవేళ రాహుల్ గాంధీ దక్షిణాది రాష్ట్రాలకు నిజంగా ప్రాధాన్యత ఇస్తున్నారనుకొంటే, కేవలం వయనాడ్‌ నుంచి లేదా దక్షిణాది రాష్ట్రాలలో మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయవచ్చు. కానీ ఆయన చిరకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నుంచి పోటీ చేస్తున్నారు. కనుక ఒకవేళ రెండు చోట్ల గెలిచినట్లయితే, వయనాడ్‌ను వదులుకొని అమేథీనే ఉంచుకొంటారు. కాదని చెప్పగలరా?


Related Post