మోడీ-కేసీఆర్‌ దుష్మన్ యా దోస్త్? కుంతియా

March 30, 2019


img

ప్రధాని నరేంద్రమోడీ, కేసీఆర్‌ ఎన్నికల ప్రచారసభలలో ఒకరిపై మరొకరు తీవ్రవిమర్శలు చేసుకోవడాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రాంచంద్ర కుంతియా ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో కుంతియా మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్రమోడీ, కేసీఆర్‌ ఇద్దరూ పైకి శత్రువులలా నటిస్తూ ఒకరిపై మరొకరు తీవ్రవిమర్శలు చేసుకొంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు ప్రధాని నరేంద్రమోడీయే కదా అనుమతించింది? ఆయనకు తెలియకుండా అసెంబ్లీ ఎన్నికలు జరుగలేదు కదా? కానీ ఇప్పుడు ముందస్తు ఎన్నికలు ఎందుకు నిర్వహించారని కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా నిర్వహిస్తే ప్రజాధనం వృధా అవుతుందని తెలిసినప్పుడు కేసీఆర్‌ను ముందస్తుకు ఎందుకు అనుమతించారు? 

అలాగే గత 5 ఏళ్ళుగా ప్రతీ సందర్భంలో నరేంద్రమోడీకి అండగా నిలిచిన కేసీఆర్‌కు అప్పుడు మోడీలో ఈ తప్పులేమీ కనిపించలేదా? మోడీ తెలంగాణకు అన్యాయం చేశారని ఇప్పుడు విమర్శిస్తున్న కేసీఆర్‌ అప్పుడు ఆయన ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఇచ్చారు? లోక్‌సభ ఎన్నికల తరువాత మళ్ళీ మద్దతు ఈయనని కేసీఆర్‌ ప్రజలకు హామీ ఇవ్వగలరా? అసలు మోడీని మళ్ళీ ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. మరి అటువంటప్పుడు ఇద్దరూ శతృత్వం నటిస్తూ పరస్పరం విమర్శలు చేసుకోవడానికి అర్ధం ఏమిటి? ప్రజలను మభ్యపెట్టడానికే కదా?” అని విమర్శల వర్షం కురిపించారు. 


Related Post