ఫిరాయింపులపై ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్‌ పోరాటం?

March 30, 2019


img

తెరాసలో చేరిన 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీలో ఆయన కార్యాలయానికి వెళ్ళారు. కానీ ఆ సమయంలో ఆయన అక్కడ లేకపోవడంతో వారు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకి వినతిపత్రం అందించాలని వెళ్ళారు. కానీ స్పీకర్ అనుమతిలేనిదే ఇటువంటి పిటిషన్లను తీసుకోలేనని చెప్పడంతో కాంగ్రెస్‌ నేతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసి వినతిపత్రం ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. 

ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేసినా ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. స్పీకర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలనుకొంటే అది సాధ్యపడలేదు. కనుక త్వరలో కాంగ్రెస్‌ పార్టీ హైకోర్టులో దీనికోసం పిటిషన్ వేయవచ్చు. కానీ ఈవిషయంలో న్యాయస్థానాలు కూడా ఏమీ చేయలేవని గతంలోనే రుజువైంది. కనుక ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ కోర్టుకు వెళ్ళినా ప్రయోజనం ఉండకపోవచ్చు. కాంగ్రెస్‌ పార్టీ కోర్టుకు వెళ్ళేలోపుగానే మరో 3-4 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలోకి రప్పించి కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని తెరాసలో విలీనం చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో టిడిపి ఎమ్మెల్యేలపై అనర్హతవేటు నుంచి తప్పించుకొనేందుకు తెరాస ఇదే విధానం అవలంభించింది. కనుక ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల విషయంలోనూ అదేవిధంగా చేయవచ్చు. సే అవకాశాలున్నాయని భావించవచ్చు. 

ఈ పరిస్థితులలో కాంగ్రెస్‌ నేతలకు ఒకే ఒక మార్గం మిగిలుంది. అదే...ప్రజలవద్దకు వెళ్ళి మొరపెట్టుకోవడం. కాంగ్రెస్‌ నేతలు అదే చేయబోతున్నారు. ఏప్రిల్ 1న జహీరాబాద్, హుజూర్‌నగర్‌, వనపర్తిలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారసభలకు భారీగా జనసమీకరణ చేయడానికి కాంగ్రెస్‌ నేతలు సన్నాహాలు చేసుతున్నారు. ఆ సభలలో ఈ ఫిరాయింపుల అంశాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్‌ నేతలు అందరూ ప్రస్తావించి తెరాసను ఎండగట్టాలని నిర్ణయించుకొన్నారు. 

ప్రజాస్వామ్యంలో ఇటువంటి అనైతిక పద్దతులను ప్రోత్సహించడం చాలా తప్పే. ఆ తప్పును సరిదిద్దవలసిన వ్యవస్థలు చేతులు ముడుచుకొని కూర్చోవడం అంతకంటే పెద్ద తప్పు. ప్రజలు కూడా ఆ తప్పును తప్పుగా భావించకపోవడం వలననే ఈ అనైతిక పద్దతులు కొనసాగుతున్నాయి చెప్పక తప్పదు.


Related Post