కేసీఆర్‌ 150...మోడీ 300 సీట్లు!

March 30, 2019


img

ఈసారి లోక్‌సభ ఎన్నికలలో ఎన్డీయే కూటమికి 150-200, కాంగ్రెస్‌ మిత్రపక్షాలకు 100 లోపు సీట్లు మాత్రమే వస్తాయని, కనుక ఫెడరల్‌ ఫ్రంట్‌ నిర్ణయాత్మక శక్తిగా నిలువబోతోందని సిఎం కేసీఆర్‌ నమ్మకంగా చెపుతున్నారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ ఈసారి బిజెపి 300 సీట్లు గెలుచుకోబోతోందని అంతే నమ్మకంగా చెప్పారు. కేసీఆర్‌ వాదనలకు సర్వే నివేదికలను ఆధారంగా చూపుతుంటే, కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాల బలాబలాల ఆధారంగా ప్రధాని నరేంద్రమోడీ ఈమాట చెపుతున్నారు.

ప్రధాని మోడీ శుక్రవారం ఒక న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. “2014 ఎన్నికలనాటి కంటే ఈసారి దేశంలో ప్రతిపక్షాలు ఎక్కువ ఐక్యతగా ఉన్నాయి కదా? మరి ఏవిధంగా 300 సీట్లు గెలుస్తామని చెపుతున్నారు?” అనే ప్రశ్నకు సమాధానంగా, “ప్రతిపక్షాల ఐక్యతలో డొల్లతనం కనిపిస్తోంది. ఏపీ, బెంగాల్, కేరళ, ఒడిశా తదితర రాష్ట్రాలలో ఏ పార్టీలు ఎటువైపు మొగ్గుతాయో తెలియని స్థితి కనిపిస్తోంది. ఇక ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు ప్రాంతీయ పార్టీలు ఇష్టపడటం లేదు. ఒకవేళ కొన్ని పార్టీలు కాంగ్రెస్‌తో చేతులు కలిపి పనిచేసినా ఎన్నికల తరువాత అవి కాంగ్రెస్‌తో ఉంటాయనే నమ్మకం లేదు. కనుక కాంగ్రెస్ పార్టీని మాకు పోటీ అని మేము భావించడం లేదు. ఒకవేళ దేశంలో ప్రాంతీయ పార్టీలన్నిటికీ కలిపి ఎన్డీయే కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగితేనే ఏమైనా జరుగవచ్చు. కానీ అది ఈ ఎన్నికలలో సాధ్యం కాకపోవచ్చు. 2024 ఎన్నికల సమయానికి ప్రతిపక్షాలు బలపడితే అప్పుడు అవి మాతో పోటీ పడే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికలలో మాత్రం బిజెపి సొంతంగా 300 ఎంపీ సీట్లు సాధించుకొని పూర్తి మెజార్టీతో మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది,” అని చెప్పారు.   

ఫెడరల్‌ ఫ్రంట్‌కు 150-160 సీట్లు మాత్రమే వస్తాయని సిఎం కేసీఆర్‌ స్వయంగా చెపుతున్నారు కనుక కాంగ్రెస్‌, బిజెపిలలో దేనికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటే దానికి ఫెడరల్‌ ఫ్రంట్‌ మద్దతు ఈయాలి లేదా ఆ రెంటిలో ఏదైనా ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు. అంటే కాంగ్రెస్‌, బిజెపిలకు అతీతంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏమీ చేయలేదని స్పష్టం అవుతోంది.  

ఇక కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేయగల పరిస్థితిలో లేదనేది అందరికీ తెలుసు. బిజెపి 300 సీట్లు గెలుచుకొంటుందని బిజెపి నేతలందరూ నమ్మకంగా చెప్పుకొంటున్నారు కానీ కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీతో సహా ఏ ఒక్కరూ ధైర్యంగా ఆ మాట చెప్పుకోలేకపోతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ బిజెపికి పోటీగా భావించడం లేదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.  

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని కాంగ్రెస్‌ నేతలు మాత్రమే చెప్పుకొంటున్నారు. కానీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాయనుకొంటున్న తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా అంగీకరించేందుకు సిద్దంగా లేవు. అందుకే అవి తమ ప్రధానమంత్రి అభ్యర్ధి పేరును ప్రకటించలేకపోతున్నాయి. ప్రకటిస్తే ఎన్నికలకు ముందే పొత్తులు విచ్చిన్నం అయిపోతాయని వాటి భయం. అందుకే ప్రతిపక్షాల ఐక్యతలో డొల్లతనం కనిపిస్తోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 

ఏది ఏమైనప్పటికీ, ఈసారి కూడా పూర్తి మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడవలసిన అవసరం చాలా ఉంది. అస్థిరమైన, ప్రాంతీయ పార్టీల బెదిరింపులకు లొంగి పనిచేసే బలహీనమైన ప్రభుత్వం ఏర్పడితే దేశానికి తీరని నష్టం కలుగుతుందని ప్రజలందరూ గుర్తుంచుకొని ఓట్లు వేయడం చాలా అవసరం. 


Related Post