సంచలన విషయం బయటపెట్టిన సిఎం కేసీఆర్‌

March 29, 2019


img

శుక్రవారం మిర్యాలగూడలో జరిగిన తెరాస ఎన్నికల ప్రచారసభలో సిఎం కేసీఆర్‌ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ ఒక సంచలన విషయం బయటపెట్టారు. గతంలో యూపీయే హయంలో తాను కేంద్రమంత్రిగా పనిచేస్తున్నప్పుడు 11 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని చెప్పారు. అప్పటి పాలకులు ఏనాడూ ఆ విషయాన్ని బహిర్గతం చేయలేదని కానీ ఇప్పుడు నరేంద్రమోడీ ఒక్క సర్జికల్ స్ట్రైక్ చేసి దాని గురించి పదేపదే గొప్పలు చెప్పుకొంటూ ప్రచారం చేసుకొంటున్నారని ఎద్దేవా చేశారు. మోడీ గొప్పగా చెప్పుకొంటున్న ఆ సర్జికల్ స్ట్రైక్ లో కనీసం చీమ కూడా చావలేదని జైష్ సంస్థ అధినేత మసూద్ అజర్‌ చెపుతుంటే, 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని మోడీ ప్రచారం చేసుకొంటున్నారని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. 

మోడీ తన ఐదేళ్ల పాలనలో దేశంలో ముస్లింలు, బీసీలు, దళితులు ఏ ఒక్క వర్గానికైనా మేలు చేశారా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పధకాలనే కేంద్రప్రభుత్వం కాపీ కొట్టి పేర్లు మార్చి అమలుచేస్తోందని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. కానీ వాటికంటే కూడా తెలంగాణ ప్రభుత్వం పధకాలే అన్నివిధాలా ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. 

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 5 ఏళ్ళలోపే తెలంగాణ దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలుస్తోందని కానీ సుమారు 72 ఏళ్ళు కాంగ్రెస్‌, బిజెపిల పాలనలో దేశం అన్ని రంగాలలో వెనుకబడిపోయిందని కేసీఆర్‌ అన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయడంలో ఆ రెండు పార్టీలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయని అన్నారు. ఆ రెండు పార్టీల నుంచి దేశాన్ని విముక్తి కల్పించవలసిన తరుణం ఆసన్నమైందని కేసీఆర్‌ అన్నారు. 

లోక్‌సభ ఎన్నికల తరువాత తెరాస భారతం పట్టాలని బిజెపి కలలు కంటోందని కానీ తానే వాటి భరతం పడతానని కేసీఆర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఎన్డీయే కూటమికి 150, కాంగ్రెస్ పార్టీకి 100 లోపు ఎంపీ సీట్లు వస్తాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని కేసీఆర్‌ అన్నారు. ప్రజలు కోరుకొన్నవారే ఎన్నికలలో గెలవాలి తప్ప పార్టీలు, వ్యక్తులు కాదని కేసీఆర్‌ అన్నారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా అవసరమైతే జాతీయపార్టీని ఏర్పాటు చేస్తానని కేసీఆర్‌ ప్రకటించారు.


Related Post